గుట్టను మింగుతున్న ఘనుడు.. అధికార పార్టీలో ఎవరతను..?

by  |
గుట్టను మింగుతున్న ఘనుడు.. అధికార పార్టీలో ఎవరతను..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సహజ సంపదపై కొంతమంది అక్రమార్కులు కన్నేసి కొండలను పిండి చేస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలు, కొండలను మాయం చేస్తున్నారు ఘనులు. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన కొండలు రూపు రేఖలను కోల్పోతున్నాయి. అధికార పార్టి నేతల అండతో అటవీ భూమి, సర్కారు భూముల్లోని సహజ సంపదలను కరిగించేస్తున్నారు. అటవీ, రెవెన్యూ, భూగర్భ గనుల శాఖలను కంటితో శాసిస్తూ మైనింగ్ చేస్తున్నారు.

20 ఏళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో పచ్చని చెట్లతో కాకులు దూరని కారడవులుగా బాన్సువాడ, వర్ని ఫారెస్టు పేరు గాంచాయి. రాను రాను ఈ రేంజ్ పరిధిలోని కొండలను అక్రమార్కులు తవ్వడం మొదలుపెట్టారు. కొందరు మొరం కోసం తవ్వకాలు సాగిస్తుండగా.. మరికొందరు గ్రానైట్ వ్యాపారం కోసం రాళ్లను తవ్వేస్తూ కోట్లకు పడిగెత్తుతున్నారు. ఇప్పటికే వర్ని, బాన్సువాడ రేంజ్ అటవీ శాఖ పరిధిలోని కొండలన్నీ పెద్ద పెద్ద యంత్రాలతో రాత్రికి రాత్రే తవ్వేశారు. తగిలేపల్లి అటవీ ప్రాంతంలో కూడా ఓ కొండపై కొందరు అక్రమార్కులు కొన్ని నెలలుగా గ్రానైట్ కోసం తవ్వకాలు చేపట్టారు.

అధికార పార్టికి చెందిన ప్రముఖ నాయకుడి అండతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక నేత సహయంతో గుట్టలోని గ్రానైట్ రాయి త్రవ్వకాలు రాత్రి పగలు జరగుతున్నాయి. భూగర్జ గనుల శాఖకు సినరేజీ చార్జీలు కట్టకుండా, రెవెన్యూ, అటవీ శాఖల అనుమతి లేకుండా.. రాత్రి పగలు తేడా లేకుండా గ్రానైట్ త్రవ్వకాలు జరుగుతుంటే అధికార యంత్రాంగాలు చోద్యం చూస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా స్పందించాల్సిన అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ అక్రమ తవ్వకాలకు చెక్ పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు లేవు..

తగిలేపల్లి కొండపై గ్రానైట్ తవ్వకాల కోసం ఎవ్వరికీ అనుమతులు లేవు. అది మా దృష్టిలో రాలేదు. దీనిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. అది అటవీ స్థలమా, సర్కారు స్థలమా అనేది పరిశీలిస్తాం. అక్కడ గ్రానైట్ త్రవ్వకాల గురించి మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. -వీరేశ్, వర్ని అటవీ శాఖ రేంజ్ అధికారి

తగిలేపల్లి కొండలో మైనింగ్ విషయంను పరిశీలిస్తాం..

వర్ని అటవీ శాఖ రేంజ్ పరిధిలోని తగిలేపల్లి కొండలపై కొనసాగుతున్న గ్రానైట్ తవ్వకాల మా పరిధిలోకి రాదు. అదంతా భూగర్భ గనుల శాఖ చూసుకోవాలి. ఒకసారి అక్కడికి వెళ్లి పరిశీలిస్తాం. రెవెన్యూ భూములు, సర్కారు భూములని తెలితే చర్యలకు సిఫారసు చేస్తాం. -విఠల్, వర్ని తహసీల్దార్


Next Story

Most Viewed