చంటి బిడ్డల తల్లుల కోసం మిల్క్ బ్యాంక్.. 

37

దిశ, ఫీచర్స్ : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో పాలిచ్చే తల్లుల కోసం ‘మిల్క్ బ్యాంక్’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాణి దుర్గావతి ఆస్పత్రి(లేడీ ఎల్గిన్)లో ఈ సెంటర్‌ను నెలకొల్పేందుకు అధికారులు నిర్ణయించారు. హాస్పిటల్‌ను తనిఖీ చేసిన డాక్టర్ల బృందం.. పైలట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా UNICEF సహకారంతో నేషనల్ హెల్త్ మిషన్ ఈ ప్రాజెక్టు లో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో హెల్త్ సర్వీస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ మిశ్రా ‘మిల్క్ బ్యాంక్’ గురించి పలు విషయాలు వెల్లడించారు.

‘చంటి బిడ్డల తల్లుల్లో కొంతమంది ఎక్కువ మొత్తంలో పాలు ఇవ్వడం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇదే సమయంలో తమ బిడ్డలకు సరిపడా పాలు అందించలేని తల్లులు కూడా ఉన్నారు. అందుకే ‘రాణి దుర్గావతి హాస్పిటల్‌’లో మిల్క్ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని చెప్పారు. వీటిలో నిల్వ ఉంచిన పాలను ఈ ఆసుప్రతిలో చేరిన రోగులకే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చే రోగులకు కూడా ఉచితంగా అందిస్తామని ఆయన తెలియజేశారు.

ఎక్కువ మొత్తంలో పాలు ఇవ్వగల మహిళల నుంచి సేకరించిన పాలను పాశ్చరైజ్ చేసి నిల్వ చేస్తారు. తద్వారా తల్లి పాలను సమృద్ధిగా పొందలేకపోతున్న చంటిపిల్లలకు అందుబాటులో ఉంచుతామని సంజయ్ వెల్లడించారు. రెండు నెలల వ్యవధిలో మిల్క్ బ్యాంక్ సేవలు ప్రారంభమవుతాయని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు.