సెట్విన్ ల్యాండ్ స్వాహా

by  |
సెట్విన్ ల్యాండ్ స్వాహా
X

అధికార పార్టీ నేతల భూ దాహానికి ప్రభుత్వ స్థలాలు కనుమరగవుతున్నాయి. పక్కాగా ప్లాన్​చేసి కోట్లవిలువైన భూములను కొట్టేస్తున్నారు. పక్కనున్న స్థలాల సర్వే నెంబర్ ​ఆధారంగా డాక్యుమెంట్లు సృష్టించి కాజేసేందుకు పథకం పన్నాడు. ప్రభత్వ స్థలమని అధికారులు గోడలపై రాసిన రాతలను చెరిపేసి అధికారుల అండదండలతో ఆక్రమించేశాడు. సొంతం చేసుకున్న స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు జీహెచ్​ఎంసీ పర్మిషన్​కోసం దరఖాస్తు చేసుకోగా ఆమోదం సైతం తెలిపారు. ఇదీ శేరిలింగంపల్లి నియోజవర్గంలో జరుగుతున్న భూ దందా..

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అందులో హైదర్‌నగర్ డివిజన్‌లోని సర్వే నెంబర్ 172, 173లో భూమి సెట్విన్ కు చెందింది. ఈ సర్వే నెంబర్లలోని భూములు ప్రభుత్వ స్థలంగా రెవెన్యూ రికార్డుల్లోనూ స్పష్టంగా ఉంది. ప్రస్తుత ధరణి పోర్టల్ లోనూ ఇదే విషయం స్పష్టమవుతున్నది. అయితే సదురు భూమిపై అధికార పార్టీకి చెందిన ఓ పెద్దమనిషి కన్నుపడింది. పక్కా స్కెచ్ వేశాడు. ఆ పక్కనే ఉన్న మరో సర్వే నెంబర్ 63, 66లో ఉన్న స్థలం ఇదే అంటూ సర్కార్ స్థలంలో పాగా వేశారు. దానికి అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు తయారు చేసేశారు. అయితే ఇది సర్కార్ స్థలం అంటూ అక్కడ నిర్మించిన గోడలపై రెవెన్యూ అధికారులు సర్వే 172 అని రాయిస్తే వాటిని చెరిపేశారు. అంతేకాదు ఆక్రమించిన స్థలంలో నిర్మాణా లు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. జీహెచ్​ఎంసీ నుంచి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమోదం సైతం ఇచ్చేశారు.

విచారణ లేకుండానే..!

సర్కార్ స్థలమా, ప్రైవేట్ వారిదా అని కూడా విచారించకుండానే సదరు అధికారి నిర్మాణానికి గ్రీన్​సిగ్నల్ ఇచ్చేశారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో బిల్ కలెక్టర్ అక్టోబర్ 14 అసెస్ మెంట్ చేస్తూ, సదరు స్థలాల కు సంబంధించి పీటీఐఎన్ నెంబర్లు 1240101045, 1140115420, 1140116126 కేటాయించారు. వెంటనే డోర్ నెంబర్ 1-2-33/1/167/1, అలాగే 1-2-33/1/166A నెంబర్ ఒకరికి, 1-2-33/1/166A /1 పేరున మరొకరికి ఇచ్చేశారు. అయితే ప్రభుత్వ స్థలానికి అనుమతులు ఎలా ఇస్తారంటూ సదరు అధికారులను వివరణ కోరగా ‘తమకు డీసీ చెబితేనే పర్మిషన్లు ఇచ్చాం. అది ప్రభుత్వ భూమా, ప్రైవే ట్ వ్యక్తులదా అన్నది మాకు అనవసరం. అప్లికేషన్ లో సొంతభూమి అని ఉంది అందుకే డోర్ నెంబర్ కేటాయిం చాం’ అని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. వాళ్లతో 2020-21 సంవత్సరానికి గాను హౌస్​ట్యాక్స్ గా రూ.347 ఒకరికి, రూ.332 సైతం వసూలు చేశారు. ఇలా ప్రతీది క్లియర్ గా డాక్యుమెంట్ల పరంగా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా పకడ్బందీగా అధికారులే దగ్గరుండి చేపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్థలం ఓ చోట.. సర్వే నెంబర్ మరోచోట

సెట్విన్ స్థలంలో తిష్టవేసిన వారు ఈ స్థలం తమదేనని, గతంలో ఇద్దరు వ్యక్తుల వద్ద ఈ స్థలాన్ని కొన్నట్లు చెబుతున్నారు. అది రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.., సదరు డాక్యుమెంట్ ప్రకారం వాళ్లు కొనుగోలు చేసిన 488 గజాల స్థలం సర్వే నెంబర్ 63, 66లో ఉంది. ఆ స్థలం మిత్రాహిల్స్ కాలనీకి సంబంధించింది. కానీ ప్రస్తుతం వాళ్లు కబ్జాలో ఉన్నది సెట్విన్ భూముల్లో. విలేజ్ మ్యాప్, సెట్విన్ కాలనీ స్కెచ్, గూగుల్ మ్యాపుల్లోనూ ఇదే విషయం తేటతెల్లమవుతున్నది. అంతే గాక డాక్యుమెంట్ ప్రకారం చూసినా మిత్రాహిల్స్ కాలనీ అధికారిక లే అవుట్ లో ఉన్నదానికి, మోకా మీద ఉన్నదానికి ఎక్కడా సంబంధం లేదు. ఇదిలా ఉంటే రెవెన్యూ అధికారులు గత అక్టోబర్ నెలలో సెట్విన్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. అందులో వారు మధ్యలో ఉన్న నిర్మాణాన్ని వదిలేసి దానికి ఇరువైపులా ఉన్న నిర్మాణాలను మాత్రం తాత్కాలికంగా కూల్చేశారు. మధ్యలోది ఉంచి రెండు వైపులా కూల్చడంలో అంతర్యం ఏంటో వారికే తెలియాలి.

అన్నీ తెలిసే జరిగాయా..?

ఈతతంగం అంతా అధికారుల కనుసన్నల్లోనే, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా జరిగినట్లు కబ్జాపర్వం సాగి న తీరు చూస్తే తెలిసిపోతున్నది. ఇది ప్రభుత్వ స్థలం అంటూ రెవెన్యూ అధికారులు పెద్దపెద్ద అక్షరాలతో రాసి పెట్టినా.. జీహెచ్ఎంసీ అధికారుల అప్లికేషన్ వచ్చిందే తడవుగా అసెస్ మెంట్ చేస్తూ డోర్ నెంబర్ కేటాయించా రు. ఇదంతా జరుగుతున్నదని తెలిసినా.. రెవెన్యూ అధికారులు చోద్యం చూశారు. అంటే ఇదంతా అన్ని శాఖల అధికారులకు తెలిసే జరిగిందని, తిలా పాపం తలా పిడికెడు అన్నచందంగా కబ్జాదారులు అండగా నిలిచారన్న సందే హాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్కడ ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈమధ్య కాలంలో ఇక్కడే ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పూర్తయింది. ఆ గోడలపై సైతం సర్వే నెంబర్ 172 అని రాసి పెట్టారు. కానీ నిర్మాణం మాత్రం జరిగిపోయింది.

అధికారులను కలిసినా ప్రయోజనం శూన్యం..

సర్వే నెంబర్ 172, 173లో కబ్జాల పరంపర కొనసాగుతుందంటూ కొందరు వ్యక్తులు చాలాసార్లు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులకు వినతిపత్రాలు సైతం అందజేశారు. కూకట్ పల్లి సర్కిల్ అధికారులైన డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, జోనల్ కమిషనర్ మమతతో పాటు విజిలెన్స్ ఆఫీసర్ విశ్వజిత్ కు కూడా విన్నవించారు. అయినా వారు స్పం దించిన దాఖలాలు లేవు.

ప్రభుత్వ భూములైతే చర్యలు తీసుకుంటాం

నేను కొత్తగా వచ్చాను. 172, 173 సర్వే నెంబర్లకు సంబంధించి అంతగా అవగాహన లేదు. నాకు తెలిసి అవన్నీ నైజాం వారసుల భూములు. అలాంటి వాటి జోలికి మేము వెళ్లం. రెవెన్యూ అధికారులు ఎలా
కూల్చారో తెలుసుకుంటాను. కొన్ని అక్రమ కట్టడాలను కూల్చి, మరికొన్ని వదిలేసింది తెలియదు. అది ప్రభుత్వ భూములు అయితే చర్యలు తీసుకుంటాం.

-గోవర్ధన్, కూకట్ పల్లి తహసీల్దార్


Next Story

Most Viewed