ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ సర్కారే హత్య చేస్తోంది : టీపీటీఎఫ్

by  |
Public Schools
X

దిశ, పరకాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేస్తూ సమాజంలోని దళిత, గిరిజన, మైనారిటీ బలహీన వర్గాలకు గుణాత్మకమైన విద్య అందకుండా చేస్తుందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావులరమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పత్రికలకు విడుదల చేసిన ఒక లేఖలో తెలంగాణ ఏర్పడి ఏండేడ్లు గడిచినా పాఠశాల విద్యను పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నామని విమర్శించారు. విద్య మానవ వికాసానికి తోడ్పడే విధంగా ప్రభుత్వం కృషి చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. విద్య పై ముఖ్యమంత్రి గానీ, విద్యా శాఖ మంత్రి గానీ సమీక్ష చేయని ఏకైక ప్రభుత్వం ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థలో ఎక్కడి సమస్యలు అక్కడనే పేరుకుపోతున్నాయని ఏడేళ్లు‌గా పదోన్నతులు లేక, మూడు సంవత్సరాల పైబడి బదిలీలు లేక ఉపాధ్యాయ వర్గం నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ నియామకాలు చేయక ఉన్న ఉపాధ్యాయులనే రెగ్యూలరైజ్, వర్క్ అడ్జస్ట్ మెంట్ పేరుతో శాశ్వతంగా బడులను మూసివేస్తూ వాటిని ప్రభుత్వమే హత్య చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వానికి సూచించారు. బంగారు తెలంగాణ, సంక్షేమ రాజ్యం అని చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇంతవరకు యూనిఫామ్స్ అందించకపోవడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల్ని పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందని రావుల రమేష్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed