ఎన్నికలు జరిగే రాష్ట్రాలే మోడీ సర్కార్ టార్గెట్

by  |
ఎన్నికలు జరిగే రాష్ట్రాలే మోడీ సర్కార్ టార్గెట్
X

జైపూర్: దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ ఆరోపించారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రాలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్(ఈడీ), ఆదాయ పన్నుశాఖ వంటి జాతీయ దర్యాప్తు ఏజెన్సీలను బీజేపీ ప్రభుత్వం అస్త్రంగా వాడుకుంటున్నదని విమర్శించారు. అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రాజెక్టు విషయంలో రూ.1,437 కోట్ల అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ సోమవారం కేసు నమోదుచేసింది.

ఇందులో 16 మంది ప్రభుత్వ ఉద్యోగులు సహా 189మందిని నిందితులుగా పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్రాన్ని విమర్శిస్తూ అశోక్ గెహ్లట్ వరుస ట్వీట్లు చేశారు. ‘ఎన్నికలు సమీపించే రాష్ట్రాల్లో, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొందరి సూచనలతో క్రియాశీలకంగా మారుతాయి. ఇందులో భాగంగానే యూపీలో యాక్టివేట్ అయ్యాయి. గతంలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఈ సంస్థలను దుర్వినియోగం చేశారు’ అని పేర్కొన్నారు.



Next Story

Most Viewed