రియల్టర్లకు సర్కార్ బంపర్​ ఆఫర్​

by  |
రియల్టర్లకు సర్కార్ బంపర్​ ఆఫర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజీవ్​ స్వగృహ ఇళ్ల అమ్మకంలో రియల్​సంస్థలకు ప్రభుత్వం దోచి పెడుతోంది. అసలు అప్పులు, బిల్లులు చెల్లించలేక ఆర్థిక కష్టాల్లో ఉన్న స్వగృహ కార్పొరేషన్‌పై మరో రూ.200 కోట్ల అదనపు భారం మోపుతోంది. వీటిని ముందుగా ప్రభుత్వం సర్దుబాటు చేసి టవర్ల అమ్మకాల తర్వాత తిరిగి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు.. మధ్య తరగతి వర్గాలు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎలా ఉంటే అలాగే ఇస్తామని సవాలక్ష ఆంక్షలు పెట్టిన సర్కారు… రియల్​ ఎస్టేట్​సంస్థలకు టవర్​యూనిట్‌గా విక్రయంలో మాత్రం అందంగా రెడీ చేసిన తర్వాత వారికి అప్పగించనున్నారు. సర్కారు రెడీ చేసిన ఈ ఇండ్లను లాభాలను చూసుకుంటూ రియల్​సంస్థలు తిరిగి ప్లాట్ల వారీగా అమ్మకాలు చేపట్టనున్నారు. దీనికోసం దాదాపు రూ.200 కోట్లను ప్రస్తుత ఇన్​ఫ్రాస్ట్రక్షర్​ కింద వెచ్చించేందుకు నిర్ణయం తీసుకుంది. ముందుగా ఇచ్చిన నివేదికలో ఈ మార్పులను సూచించడంతో అన్నింటినీ చేర్చి తుది ఫైల్‌ను సీఎం కేసీఆర్‌కు పంపించారు. నేడో, రేపో సీఎం నుంచి ఆమోదం రానుంది.

2013లోనే బ్రేక్..

రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం 2‌‌013లో బ్రేక్​ వేసింది. అప్పటికే దాదాపు రూ.1000 కోట్లు అప్పు తేవడం, ఎక్కడా సరైన గిట్టుబాటు ధర రాకపోవడం తదితర కారణాలతో నిర్మాణాలను ఎక్కడికక్కడే ఆపాలని ఆదేశించారు. అంతేకాకుండా పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో 2018లో మాత్రం స్వగృహ ఇండ్లను తిరిగి అమ్మకానికి తెలంగాణ సర్కారు ప్రయత్నాలు చేసింది. ఈ నిర్మాణాలను పూర్తి చేసేందుకు స్వగృహకు రూ.1‌‌05 కోట్లను విడుదల చేశారు. అయితే ఈ నిధులు సరిపోకపోవడంతో ఎంతో కొంత నిర్మాణాలు చేసి మళ్లీ మధ్యలోనే ఆపేశారు.

ప్లాట్‌గా అయితే ఇలా.. టవర్‌గా అయితే అలా..!

రాష్ట్రంలోని రాజీవ్​ స్వగృహ సముదాయాల్లో కొన్ని ప్లాట్లను ఇప్పటికే విక్రయించారు. బండ్లగూడలోని స్వగృహ సముదాయంలో దాదాపు 400 ప్లాట్లను విక్రయించి కొనుగోలుదారులకు అందించారు. అయితే అమ్మిన సమయంలో నిర్మాణాలు ఎలా ఉన్నాయో… అదే విధంగా అప్పగించారు. ఒక్క పని పూర్తి చేయమని, ఇష్టం ఉంటే కొనుగోలు చేసుకోవాలంటూ సూచించారు. దీంతో కొనుగోలు చేసిన వారే మళ్లీ సొంతంగా ఖర్చు పెట్టుకుని పనులు చేయించారు.

ఇప్పుడు పూర్తిచేసి అప్పగించేందుకు నిర్ణయం

తాజాగా స్వగృహను టవర్​ యూనిట్‌గా అమ్మకానికి పెట్టుతున్న ప్రభుత్వం.. మధ్య తరగతి వర్గాలను సొంతింటి కలను దూరం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు నిర్మాణాలు ఆగిపోయిన ప్లాట్లను మొత్తం పనులు పూర్తి చేసిన తర్వాతే రియల్ ​ఎస్టేట్​ సంస్థలకు అమ్ముతామని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రూ.100 కోట్లను వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. గతంలో 2018లో ఇచ్చిన రూ.105 కోట్లతో పాటుగా ఇప్పుడు రూ.100 కోట్లను స్వగృహలో ఇన్​ఫ్రాస్ర్టక్షర్​ కోసం వినియోగించేందుకు మార్పులు చేశారు. అంటే కిటికీలు, తలుపులు, రంగులు వేసి టవర్​యూనిట్‌గా ఇవ్వనున్నారు. వాటిని కొనుగోలు చేసుకున్న తర్వాత ఎంత ధరకైనా రియల్​ సంస్థలు అమ్ముకునే వెసులుబాటు సైతం కల్పించారు.

వీటన్నింటినీ సమగ్రంగా నివేదించిన అధికారులు తుది రిపోర్ట్‌ను సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజునాడే సీఎం కేసీఆర్‌కు పంపించారు. నేడో, రేపో ఈ ఫైల్‌పై ఆమోదం వేయనున్నట్లు అధికారవర్గాల సమాచారం.


Next Story

Most Viewed