సీఎం జగన్ నివాసంలో గోశాల.. వైఎస్ భారతి ప్రత్యేక పూజలు..

by  |
Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి 6 గోవులను తీసుకువచ్చారు. అయితే ఆ గోవులకు సీఎం జగన్ సతీమణి వైఎస్‌ భారతి పూజచేసి గోశాలకు తరలించినట్లు తెలుస్తోంది. పార్కింగ్ ప్రాంతంలో ఈ గోశాలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి గోశాలను సందర్శించారు. అనంతరం గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఇంత ఆకస్మాత్తుగా గోశాలను ఏర్పాటు చేయడంపై అటు వైసీపీ నాయకుల్లో.. ఇటు ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Jagan

గోశాల ఏర్పాటుపై ఆసక్తికర చర్చ

గోశాలలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రత్యేక పూజలు చేశారంటూ వస్తున్న వార్తలపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అయితే ముఖ్యమంత్రి హోదాలో సీఎం వైఎస్ జగన్ మాత్రమే పట్టు వస్త్రాలను సమర్పించారు కానీ ఏనాడూ వైఎస్ భారతి హాజరు కాలేదు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రులకు ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. కానీ జగన్ మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికీ విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వైఎస్ భారతి ఆకస్మికంగా తమ నివాసంలో గోశాలను ఏర్పాటు చేయటం చర్చనీయాంశంగా మారింది.

Jagan

స్వరూపానందేంద్ర సరస్వతి సూచన మేరకేనా?

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచనల మేరకే గోశాల ఏర్పాటు జరిగిందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల వైసీపీ ఎంపీలు.. ఎంపీ ల్యాండ్స్‌ నిధులను చర్చిల నిర్మాణాలకు కేటాయించటంపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. ఈ కారణంగానే అసలు విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందోనన్న భయంతో పాటు మరోవైపు హిందువులలో ఇప్పటికే ఉన్న అసహనం ఎక్కడ భగ్గుమంటుందో అన్న ముందు చూపుతోనే గోశాల ఏర్పాటు చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరగడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచన మేరకే హిందూ ధార్మిక పరిషత్‌ సైతం ఏర్పాటు చేసినట్లు వినికిడి. ఇప్పుడు కూడా ఆ స్వామీజీ సూచనల మేరకే గోశాలా ఏర్పాటు జరిగిందని ప్రచారం జరుగుతోంది.

Next Story