ఆ తీపి వార్త.. ఇప్పటికీ సస్పెన్సే…!

by  |
cm-kcr government
X

దిశ, తెలంగాణ బ్యూరో : “తెలంగాణ రైతాంగానికి అది పెద్ద తీపి కబురు కూడా చెప్పబోతా ఉన్న. దానికి సంబంధించిన ఫైనాన్స్ అంతా వర్కవుట్ అయింది. రాబోయే కొద్ది రోజుల్లోనే మంచి మాట చెప్తా. ప్రపంచంలోనే కాదు.. ఇండియాలోనే ఎక్కడా కూడా రైతాంగం కోసం లేనటువంటి గొప్ప శుభవార్త కూడా అందించబోతా. వెరీ షార్ట్ పీరియడ్‌లో. దాని కోసం అందరూ వేచి ఉండాలి. మీరు కూడా (మీడియాను ఉద్దేశించి) వేచి ఉండాలి. కొద్దిగా సస్పెన్స్ పెడదాం. ఒక్క వారం వరకు లెక్కాచారం అంతా తీసి.. అసలు భారతదేశమే ఆశ్చర్యపడే, అడ్డంపడే వార్త ఒకటి చెప్తాం’’
– ముఖ్యమంత్రి కేసీఆర్, మే 29, 2020, కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవం తర్వాత మీడియా సమావేశంలో అన్న మాటలివి.

వారం రోజుల్లోనే దేశమే ఆశ్చర్యపడే, అడ్డంపడే శుభవార్త అంటూ కేసీఆర్ ఊరించినా ఇప్పటికీ 393 రోజులైంది. కానీ ఆ వార్త రానే లేదు. ఈ లోపు మూడు రైతుబంధు డబ్బులు కూడా విడుదలయ్యాయి. ‘దళిత్ ఎంపవర్‌మెంట్’ పథకం ద్వారా పేద దళిత కుటుంబాలకు తలా పది లక్షల రూపాయల నగదు సాయం ప్రకటించడంతో ఇప్పుడు రైతులంతా కేసీఆర్ గతంలో చెప్పిన ‘శుభవార్త’ కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది మే నెల 29న ఆ వార్త చెప్పడంతో ‘వారం రోజుల్లోనే’ అంటే జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ వార్త వస్తుందని చాలా మంది ఆశించారు. కేసీఆర్ చెప్పినట్లుగానే వేచి చూశారు. కానీ ఆ ప్రకటన ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉండిపోయింది.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వచ్చిందీ.. పోయింది.. ఆ తర్వాత పంద్రాగస్టూ అయిపోయింది. ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవం కూడా సింపుల్‌గానే జరిగిపోయింది. కానీ ఆ శుభవార్త మాత్రం ఇంకా బైటకు రాలేదు. పైగా “కేసీఆర్ ఒకసారి పట్టుబడితే అది మొండిపట్టు పడతాడు అనేది తెలుసు. అనేక ఆకర్షణీయ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఆదర్శంగా నిలిచింది. ఈ పథకంతో వంద శాతం ఆదర్శం అయి తీరుతది. కాకపోయే ప్రశ్నే లేదు. గొప్ప రైతాంగంగా, ఆధునిక రైతాంగంగా, ఆదర్శ రైతాంగంగా, అద్భుతాలు సృష్టించే రైతాంగంగా తయారుకావాలె. ఇది నా కోరిక, నా కల“ అంటూ వ్యాఖ్యానించినా ఆ తీపి వార్త ఏమిటో తెలియక, ఎప్పుడు ప్రకటిస్తారో తెలియక ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఆ శుభవార్త ఏమై ఉంటుందా అని వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలోనే చర్చ జరిగింది. రైతుబంధు, రైతుబీమా అందుతున్నందున ఇకపైన రైతులందరికీ ఉచితంగా ఎరువులు, విత్తనాలు లాంటివి ఇస్తారేమో అనే ఊహాగానాలు మొదలయ్యయి. కానీ ఆ తర్వాత రెండు సీజన్‌లు వచ్చాయి.. పోయాయి.. కానీ గుడ్ న్యూస్ మాత్రం కేసీఆర్ వెల్లడించలేదు.

తెలంగాణ ఉద్యమం సమయంలో నెల రోజుల్లో ప్రకటన వస్తుందంటూ అప్పటి మంత్రులు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని పాత్రికేయులు ప్రశ్నిస్తే… నెల అంటే సరిగ్గా 30 రోజులే అని ఎందుకనుకోవాలి అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ చెప్పిన ‘వారం రోజుల్లో శుభవార్త’ అంటే వారం రోజులే అని ఎందుకనుకోవాలి అనే తీరులో ఏడాది దాటినా ఎలాంటి ప్రకటనా రాలేదు.

గతంలో ఇదే తీరులో సీఎం కేసీఆర్ చాలా ప్రకటనలు చేశారు. కానీ కొన్ని ఇప్పటికీ అమలుకు నోచుకోకుండా పోయాయి. డల్లాస్, ఇస్తాంబుల్, లండన్, వాషింగ్టన్.. ఇలా చాలా హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు రైతాంగం కోసం చెప్పే తీపి కబురు కూడా వాటిల్లో ఒకటిగా మిగిలిపోయింది. మరోవైపు ఈసారి దిగుబడి అద్భుతంగా వచ్చిందంటూ రైతులు, ప్రభుత్వం సంతోషపడినా వాటిని తడిచిపోకుండా కాపాడుకోడానికి నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వమూ నివారణ చర్యలు, ముందుజాగ్రత్త ఏర్పాట్లు చేయలేకపోయింది. తడిచిన ధాన్యాన్ని కొంటామని ప్రభుత్వం చేసిన ప్రకటనా అటకెక్కింది. రైతులు ఆర్థికంగా నష్టపోయారు. రైతాంగం గొప్పగానూ, అద్భుతాలు సృష్టించేవారిగానూ ఉన్నా ప్రభుత్వం తరఫున తగిన చర్యలు మాత్రం లేవు.

గతంలో ‘దళితుడే సీఎం, మూడు ఎకరాల భూమి, సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోడానికి ఐదారు లక్షల రూపాయల సాయం చేయడం, నిరుద్యోగ భృతి‘.. ఇలాంటి చాలా హామీలు అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు దళిత్ ఎంపవర్‌మెంట్ పథకంపై సరికొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఇదైనా సక్రమంగా అమలవుతుందా లేక ఆ జాబితాలో ఒకదానిగా చేరిపోతుందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో పురుడు పోసుకున్న ఈ పథకం తొలి ఫలాలు తొందరగానే రావచ్చన్న ఆశలూ ఉన్నాయి.

Next Story

Most Viewed