చైన్ స్నాచర్లు మళ్ళీ మొదలయ్యారా..?

by  |
చైన్ స్నాచర్లు మళ్ళీ మొదలయ్యారా..?
X

దిశ, కామారెడ్డి : వృద్ధురాలు ఇంటిముందు పువ్వులు తెంపుతోంది. కాసింత దూరంలో ఓ బైకుపై ఉన్న ముగ్గురిలో ఒకరు ఆ వృద్ధురాలి వద్దకు వచ్చి అమ్మా.. హనుమాన్ టెంపుల్ ఎక్కడ అని అడిగాడు. ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి ఉందని ఆ వృద్ధురాలు సమాధానం చెప్పగానే మెడలో ఉన్న బంగారాన్ని తెంపుకుని అక్కడినుంచి బైకుపై ఉడాయించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనిలో నివాసం ఉండే వరలక్ష్మి (60) అనే వృద్ధురాలు రోజు మాదిరిగానే గురువారం ఉదయం లేచి ఇంటిముందు వాకిలి ఊడ్చేసింది. అనంతరం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పూజకు కావాల్సిన పువ్వుల కోసం బయటకు వచ్చి ఇంటిముందు పువ్వులు తెంపుతోంది. బైకుపై వచ్చిన ముగ్గురిలో ఒకరు ఆమె వద్దకు వచ్చి అడ్రస్ ఆడిగినట్టు అడిగి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారాన్ని అపహరించారు. వెంటనే తేరుకున్న వృద్ధురాలు అరిచేలోపు ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఆ వృద్ధురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. పట్టణ ఎస్.హెచ్.ఓ మధుసూదన్ ఆధ్వర్యంలో పోలీసులు కాలనికి చేరుకుని విచారణ చేపట్టారు.

చైన్ స్నాచర్లు మళ్ళీ మొదలయ్యారా..?

జిల్లా కేంద్రంలో గతంలో అనేక దొంగతనాలు జరిగేవి. ముఖ్యంగా చైన్ స్నాచర్లు ఓ రేంజిలో చోరీలకు పాల్పడి పోలీసులకు చుక్కలు చూపించారు. ఇటీవల చైన్ స్నాచర్ల ఆగడాలు తగ్గాయి. కాలనిలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. చాలా రోజుల తర్వాత తెల్లవారుఝామునే మళ్ళీ చైన్ స్నాచర్లు తమ ప్రతాపం చూపించారు. దాంతో చైన్ స్నాచర్ల ఆగడాలు మళ్ళీ మొదలయ్యాయా అనే చర్చ మొదలైంది. ఉదయం జరిగిన దొంగతనంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

Next Story

Most Viewed