తొమ్మిది మంది ఉద్యోగుల ప్రాణాలు తీసిన జీవో ఇదే..!

334
suicide

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో కారణంగా 9 నిండు జీవితాలు బలయ్యాయి. సొంత జిల్లాను విడిచి మరో జిల్లాకు బదిలీపై వెళ్లాల్సి వస్తోందని మనోవేదనకు గురై గుండెపోటుతో ఆరుగురు మృతిచెందారు. మరో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిలో ఆరుగురు టీచర్లున్నారు. కాగా గుండెపోటుతో మరణించిన ఆరుగురిలో ఐదుగురు ఉపాధ్యాయులే ఉండటం గమనార్హం. కాగా ఒకరు హెల్త్​సిబ్బందికి చెందిన మహిళ. ఇదిలా ఉండగా రోజురోజుకూ ఇలా మనోవేదనకు గురై మరణిస్తున్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కార్​తీసుకొచ్చిన జీవో 317 ద్వారా స్థానికతను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి చావులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తీవ్ర ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి.

తెలంగాణలో మొత్తం వర్కింగ్​టీచర్లు ఒక లక్ష తొమ్మిది వేల మంది ఉన్నారు. కాగా ఇందులో దాదాపు 22 వేల మందికి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీలు జరిగాయి. ఎన్నో ఏండ్లుగా స్థానికంగా ఉన్నవారిని వందల కిలోమీటర్ల దూరం పంపడంతో మహిళా టీచర్లకు ఇబ్బందిగా మారింది. దీనివల్ల కుటుంబాన్ని, పిల్లలను వదిలి వెళ్లాల్సిరావడం, వృద్ధులైన కన్న తల్లిదండ్రులు, అత్తా మామలకూ దూరంగా వెళ్లాల్సి ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురై ఆరుగురు గుండెపోటుతో, ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇందులో మహబూబాబాద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బీ జైత్రం, మహబూబాబాద్​జిల్లా మరిపెడ మండలం పీఎస్ పూసల తండాకు చెందిన ఉపాధ్యాయురాలు పీ శ్రీమతి, వరంగల్ కు చెందిన గోపి, మదనాపూర్ లో కృష్ణయ్య, హుజూర్​నగర్​కు చెందిన రికార్డ్​అసిస్టెంట్ మురళి, వరంగల్ కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్న హెల్త్​సిబ్బంది జయమ్మ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. కాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన బేతల సరస్వతి, ఖమ్మం జిల్లాకు చెందిన ఏఆర్​కానిస్టేబుల్ అశోక్​కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో ఉపాధ్యాయుడి భార్య సైతం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా అప్పటికే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సమ్మయ్య అనే టీచర్​బదిలీ అనే వార్తవిని మరింత అస్వస్తతకు గురై ప్రాణాలు విడిచాడు.

తెలంగాణ సర్కార్​హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల ఉద్యోగులను 32 కొత్త జిల్లాలకు కేటాయింపులు చేశారు. ప్రభుత్వం జీవో 317ను తీసుకొచ్చి కొత్త జిల్లాల స్థానికతను పక్కనబెట్టి సీనియారిటీకే ప్రాధాన్యం ఇస్తూ ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టింది. అయితే సీనియారిటీ లిస్ట్ తప్పుల తడకలుగా ఉండగా, కొన్ని జిల్లాల్లో అయితే కనీసం సీనియారిటీ లిస్ట్ కూడా లేకపోవడం గమనార్హం. దీనికి తోడు ఉపాధ్యాయుల బదిలీల్లో అవినీతి సైతం జరిగిందని పలువురు ఆరోపణలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తొమ్మిది మంది తమ నిండు జీవితాలను కోల్పోవాల్సి వచ్చిందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ సర్కార్​వెంటనే ఈ జీవోను సవరించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుండగా ఈ ప్రక్రియను పూర్తిగా నిలిపివేసి స్థానికత ఆధారంగా చేపట్టాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు డిమాండ్​చేస్తున్నాయి.

వాస్తవానికి స్థానికేతర కోటాలో చేరినవారైనప్పటికీ.. ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్‌ ప్రకారం ఉద్యోగులకు జిల్లాను కేటాయించాల్సి ఉంది. సాధారణంగా బదిలీ అయితే కొన్నేళ్లకు మళ్లీ కోరుకున్న ప్రాంతానికి రావొచ్చు. కానీ, కొత్త జిల్లాల వారీగా కేటాయింపులు శాశ్వతం. అంటే సర్వీస్​అంతా ఉద్యోగులకు కేటాయించిన జిల్లాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత జిల్లాను వదిలి వెళ్లాల్సి వస్తోందనే బాధతో స్థానికత ఆధారంగానే జిల్లాలకు కేటాయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్​చేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు, మంత్రికి సైతం పలు ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రాలు సమర్పించాయి. నూతన జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపు కోసం రూపొందిస్తున్న జాబితాలు లోపభూయిష్ఠంగా ఉన్నాయని, పలు జిల్లాల్లో అప్పీల్‌ చేసుకునే సమయమూ ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు స్థానికతనూ పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

స్థానికత ఆధారంగానే బదిలీలు చేపట్టాలి

ఇప్పుడు చేడుతున్న బదిలీల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయాలి. మరో మూడు నెలల్లో అకడమిక్​ఇయర్​పూర్తవుతుంది. తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, అలాగే స్థానికత ప్రాతిపదకన బదిలీలు చేపట్టాలి. పదోన్నతలు కల్పించిన అనంతరం ఏర్పడిన ఖాళీల్లో నష్టపోయిన ఉపాధ్యాయులను భర్తీ చేసి న్యాయం చేయాలి. బ్లాక్​చేసిన 13 జిల్లాల వారికి కూడా అవకాశం కల్పించాలి. జిల్లా స్థాయిలో జరిగిన తప్పులపై ఆయా జిల్లాల కలెక్టర్లు సరిచూసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
– కటకం రమేశ్, టీఆర్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

చస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదా?

అడ్డుగోలుగా చేపట్టిన బదిలీల కారణంగా ఉద్యోగులు గుండె ఆగి ప్రాణాలు కోల్పోతున్నారు. మానసిక ఒత్తిడి భరించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొంత మంది ప్రాణాలు కోల్పోకముందే ప్రభుత్వం పట్టించుకొని ఈ ప్రక్రియను ఆపేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తే టీచర్లకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఉపాధ్యాయులు చేసుకున్న అప్పీళ్లనైనా పరిశీలించి పరిష్కారం చూపాలి.
– కె.రమణ, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు