వర్షాలు ఉంటే టార్పాలిన్లు ఇవ్వండి : మంత్రి గంగుల ఆదేశం

886
tarpaulins

దిశ, తెలంగాణ బ్యూరో : అకాల వర్షాలు పడుతున్న కొనుగోలు కేంద్రాలున్న ప్రాంతాల్లో రైతులకు టార్పాలిన్లు ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కాకుండా కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని ఆదివారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4039 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. గత వానాకాలంలోని ఉత్పత్తిని సేకరించినట్లే ఈ సారి కూడా దాదాపు అదే సగటుతో ధాన్యాన్ని తీసుకుంటున్నామన్నారు.

2020 సీజన్లో నవంబర్ 13వ తేదీ వరకు దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే, ఈ సీజన్లో ఇప్పటికే లక్షా 13 వేలకు పైగా రైతుల నుంచి 1510 కోట్ల విలువ గల 7 లక్షల 71వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ధాన్యం రవాణాలోనూ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎప్పటికప్పుడు కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామన్నారు.

77 శాతం రేషన్ బియ్యం పంపిణీ

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ వేగంగా జరుగుతుందని మంత్రి తెలిపారు. నవంబర్ లో 2,99,310 మెట్రిక్ టన్నుల కేటాయింపుల్లో ఇప్పటి వరకు 77 శాతం( 2,29,231)మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. దాదాపు 67లక్షల కార్డు దారులు బియ్యాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. పౌరసరఫరాల శాఖ సర్వర్లలో, ఈ పాస్ మిషనరీల్లో ఎలాంటి సమస్యలు లేవన్నారు మంత్రి తేల్చి చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..