దోమలపై బల్దియా దండయాత్ర.. స్పెషల్ డ్రైవ్‌కు ఏర్పాట్లు

by  |
దోమలపై బల్దియా దండయాత్ర.. స్పెషల్ డ్రైవ్‌కు ఏర్పాట్లు
X

దిశ, సిటీ బ్యూరో: ఇప్పటికే మహానగర వాసులు వెన్నులో వణుకు పుట్టిస్తొన్న కరోనా.. దానికి తోడు ఎప్పటికప్పుడు పెరుగుతున్న డెంగీ కేసులు. దోమల నివారణకు ఏడాది పొడువునా రొటీన్ చర్యలు చేపడుతున్న బల్దియా ఈ నెల 23 నుంచి ప్రత్యేక దండయాత్రను నిర్వహించేందుకు సిద్దమైంది. ఇప్పటికే నగరంలోని ఆరు జోన్లలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందే సుమారు 360 హాట్ స్పాట్‌లను గుర్తించిన అధికారులు వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నగరంలో మరిన్ని అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముండటం, మరో వైపు మూడో దశ కరోనా ముంచుకురావటంతో ఈ సారి వైద్యారోగ్య శాఖను సమన్వయం చేసుకుని బల్దియా దోమల నివారణకు చర్యలు చేపట్టనుంది. ఈ నెల 19 వ తేదీ నాటికి అఫిషియల్ రికార్డుల ప్రకారం డెంగీ కేసులు 120 దాటిపోయాయి. మున్ముందు టైఫాయిడ్ వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశముండటంతో పది రోజుల పాటు ప్రతి రోజు 360 హాట్ స్పాట్లలో దోమల నివారణ చర్యలను ఏకకాలంలో శాస్త్రీయంగా నిర్వహించేందుకు ఉభయ శాఖలు సిద్ధమయ్యాయి.

ఇప్పటికే సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా డెంగీ కేసులు నిర్ధారణ అయిన హై రిస్కు ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలను మరింత ముమ్మరం చేయనున్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా సర్కిల్‎లో 20 హై రిస్కు ప్రాంతాలు గుర్తించగా, ఉప్పల్‎లో 16, హయత్‎నగర్‎లో 15, ఎల్బీనగర్‎లో 21, సరూర్ నగర్‎లో 18 ప్రాంతాలను గుర్తించి దండయాత్రను నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. వీటితో పాటు చార్మినార్ జోన్ పరిధిలోని మలక్ పేట సర్కిల్‎లో 9, సంతోష్ నగర్‎లో 8, చాంద్రాయణగుట్టలో 5, చార్మినార్ సర్కిల్‎లో 11, ఫలక్ నుమాలో 11, రాజేంద్రనగర్‎లో18 హై రిస్కు ప్రాంతాలను గుర్తించినట్లు చీఫ్ ఎంటమాలజిస్ట్ డా. రాంబాబు తెలిపారు.

వీటితో పాటు ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మెహిదీపట్నంలోని 15, కార్వాన్ సర్కిల్‎లో 7, గోషామహాల్‎లో 31, ఖైరతాబాద్ సర్కిల్‎లో 5, జూబ్లీహిల్స్‎లో 20 హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించారు. సికింద్రాబాద్ జోన్‌లోని ముషీరాబాద్ సర్కిల్‌లో 6, అంబర్ పేటలో 6, మల్కాజ్‎గిరిలో 6, సికింద్రాబాద్ 5, బేగంపేటలోని 4 ప్రాంతాలను గుర్తించారు. శేరిలింగంపల్లిలోని యూసుఫ్ గూడ సర్కిల్‎లో 8, శేరిలింగంపల్లి సర్కిల్‎లో 46, చందానగర్‎లో 16, రామచంద్రాపురం, పటాన్ చెరుల్లో 4 ప్రాంతాలను గుర్తించగా, కూకట్ పల్లి జోన్ పరిధిలోని మూసాపేట సర్కిల్‎లో 10, కూకట్ పల్లిలో 9, కుత్బుల్లాపూర్‎లో 4, గాజుల రామారంలో 1, ఆల్వాల్‎లో 5 ప్రాంతాలతో పాటు మొత్తం 360 ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

రెండు రకాల విధులకు అదనంగా 200 మంది..

ఇప్పటికే దాదాపు 2400 మంది ఎంటమాలజీ సిబ్బంది దోమల నివారణ కోసం విధులు నిర్వర్తిస్తుంది. దీనికి తోడు కరోనా ఫస్ట్ వేవ్‎లో కరోనా వైరస్ నివారణ, కరోనా బాధితులకు సహాయ సహకారాలను అందించేందుకు ఔట్ సోర్స్ ప్రాతిపదికన జోన్ల స్థాయిలో నియమించిన 200 మందికి కరోనా నివారణ చర్యలతో పాటు ఎంటమాలజీ విధులపై కూడా శిక్షణ నిచ్చినట్లు, అసరమైతే వారిని కూడా ఈ దోమలపై దండయాత్రకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ డ్రైవ్ లో ఏం చేస్తారు?..

దోమల నివారణ కోసం ఈ నెల23 నుంచి నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్‎లో భాగంగా బల్దియా ఎంటమాలజీ సిబ్బంది, వైద్యారోగ్యశాఖ అధికారులు దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి అక్కడ యాంటీ లార్వా ఆపరేషన్‎ను నిర్వహించనున్నారు. ఇప్పటికే డెంగీ వంటి వ్యాధులు నిర్ధారణ అయిన ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు నివారణ చర్యలను చేపట్టనున్నారు. బాగా లార్వా వృద్ధి చెందిన ప్రాంతాల నుంచి శ్యాంపిల్స్‌ను సేకరించి, సదరు లార్వా నుంచి ఏ రకమైన దోమ నుంచి వృద్ధి చెందుతుంది, ఇలాంటి రకమైన లార్వా ఇంకా ఎక్కడెక్కడుందన్న విషయాన్ని నిర్ధారించుకుని, దాన్ని నివారించటం వంటి చర్యలు చేపట్టనున్నారు.

ఆ తర్వాత ప్రతి ఆదివారం పది నిమిషాలు..

దోమల నివారణకు బల్దియా చేపట్టిన దండయాత్ర డ్రైవ్ ముగిసిన తర్వాత రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి 10 నిమిషాల పాటు ఇంటి పరిసరాల్లో దోమల నివారణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని బల్దియా అధికారులు సూచిస్తున్నారు. 10 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించాల‌ని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.



Next Story

Most Viewed