అమ్మకానికి వ్యాక్సిన్ టోకెన్లు..!

by  |
అమ్మకానికి వ్యాక్సిన్ టోకెన్లు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : హై రిస్క్ పర్సన్స్‌కు అందిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్‌లో జీహెచ్ఎంసీ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లాక్‌డౌన్‌లోనూ పని ప్రదేశాల్లో ఉంటూ కొవిడ్ బారిన పడుతున్నవారిని గుర్తించిన ప్రభుత్వం వారికి ఉచితంగా ఇస్తున్న టీకాలను పక్కదారి పట్టిస్తున్నారు. టోకెన్ల జారీ ప్రక్రియలోని లోపాలను ఉపయోగించుకుని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కొందరు డబ్బుల వసూళ్లకు పాల్పడుతుండగా.. మరికొందరు తమ కుటుంబ సభ్యులకు, తెలిసిన వారికి వ్యాక్సిన్స్ వేయిస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో మూడు లక్షల మంది హైరిస్క్ పర్సన్స్‌కు ఉచిత వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు 30 వేల మందికి టీకా వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే, కొన్ని సెంటర్లలో పెద్ద పెద్ద కార్లల్లో వ్యాక్సినేషన్ కోసం రావడం ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది కేటగిరీల్లో లేని వ్యక్తులు కూడా వ్యాక్సిన్ కోసం లైన్లలో వచ్చారు. వ్యాక్సినేషన్ కోసం జీహెచ్ఎంసీ తరపున టోకెన్లు ముద్రించి ఇస్తున్నప్పటికీ అందించడంలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వైన్స్, దుకాణాలు, రేషన్, పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీల యజమానులకు వారు చెప్పిన సంఖ్య ప్రకారం టోకెన్లను అధికారులు ఇస్తున్నారు. అయితే దుకాణాల్లో పనిచేస్తున్న వారితో సంబంధం లేకుండా తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, తెలిసిన వారి పేర్లను టోకెన్లపై రాసుకుంటున్నారు. దుకాణాల్లో పని చేసే వారికి కాకుండా ఇతరులకు టోకెన్లు అందిస్తుండటంతో అసలైన అర్హులకు వ్యాక్సిన్ అందక నష్టపోతున్నారు. ప్రభుత్వ గణంకాల్లో వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఉంటున్నా.. రక్షణ లేకుండానే రెగ్యులర్‌గా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

టోకెన్లకు రేటు నిర్ణయించిన యంత్రాంగం..

మూడు లక్షల మందికి టీకా వేయాలని నిర్ణయించినప్పటికీ వీరి జాబితాను ముందుగానే సేకరించే కార్యక్రమమేదీ జరగలేదు. తమ పరిధిలోని వీధి వ్యాపారుల గుర్తింపు కార్డులను కోరుతున్నా జీహెచ్ఎంసీ వెంటనే జారీ చేయని పరిస్థితి. మాంసం, ఫిష్, కూరగాయాల, కిరాణ దుకాణాలకు లైసెన్స్‌లు కూడా లేకుండా నడుస్తున్నాయి. వీటితో పాటు రేషన్ దుకాణాలు, వైన్స్, మాంసం విక్రయ కేంద్రాల్లో ఐడీ కార్డులు ఇవ్వడం కూడా ఉండదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి టోకెన్ల పుస్తకాలను సర్కిళ్లకు పంపిస్తున్నారు. టోకెన్లను పంచే ప్రక్రియలను ఏఎంఓహెచ్‌లు, ట్యాక్స్ కలెక్టర్లు, బిల్ కలెక్టర్లు, ఇలా కింది స్థాయి సిబ్బందికి అప్పగించారు. టోకెన్లలో వాళ్లు రాసిన పేర్లకే వ్యాక్సిన్ ఇచ్చే అవకాశముండటంతో వాటిని అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. చార్మినార్ జోన్‌లోని పలు సర్కిళ్లలో ఈ దందా జోరుగా సాగుతోంది. ఒక్కో టోకెన్‌కు రూ.500 నుంచి రూ. వెయ్యి వరకూ వసూలు చేస్తున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పర్యటించే సిబ్బంది చేతివాటం కారణంగా వ్యాక్సిన్లు అవసరమైన వారికి కాకుండా ఇతరులకు వేస్తున్నారు. ఉచితంగా అందిస్తున్న టీకాలను బల్దియా సిబ్బంది చేతివాటంతో ఇతరులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన కేటగిరీల్లో లేని వారికి కూడా టోకెన్లు అమ్ముకుంటున్నారు.

స్పెషల్ డ్రైవ్ కోసం కేవలం ఒక రోజు ముందుగానే టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఖాళీ టోకెన్లను మాత్రమే జీహెచ్ఎంసీ ఇస్తుండటంతో ఎవరికీ ఇష్టమొచ్చినట్టు అమ్ముకోవడమో, ఇతరుల పేర్లను రాయడమో చేస్తున్నారు. అయితే బల్దియా ముందుగానే హైరిస్క్ పర్సన్స్ పేర్లతో టోకెన్లను జారీ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యటించి తొమ్మిది కేటగిరీల్లోని వారికి దుకాణాల్లో పనిచేస్తున్నపుడే టోకెన్లు అందజేయడం వల్ల దుర్వినియోగం కాకుండా చూడవచ్చు. వ్యాక్సినేషన్ పొందిన వారి పేర్లు, ఆధార్ కార్డు, పనిచేస్తున్న ప్రదేశాలను ఆన్ లైన్ చేయడం కూడా ఈ ప్రక్రియలో పారదర్శకతకు అవకాశం కల్పించనుంది. వ్యాక్సినేషన్ సెంటర్లకు రాకముందే అసలైన లబ్దిదారులను గుర్తించి టోకెన్లు అందించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీపై ఉంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో 21,666 మందికి వాక్సిన్..

ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటి రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వాక్సినేషన్ పూర్తి చేశారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలతో సజావుగా వ్యాక్సినేషన్ల పూర్తి చేసినట్టు అధికారులు ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకునేవారికి ఒక రోజు ముందుగానే టోకెన్లు ఇవ్వడంతో పాటు నిర్ణీత సమయాన్ని కేటాయించడంతో సెంటర్లలో ఎలాంటి సమస్యలు రాలేదని జీహెచ్ఎంసీ తెలిపింది. హైరిస్క్ పర్సన్స్‌తో పాటు ఆస్పత్రుల్లోనూ వ్యాక్సినేషన్ కొనసాగింది. శుక్రవారం హైదరాబాద్ జిల్లాలో 20,200, రంగారెడ్డిలో 9,686, మేడ్చల్ జిల్లాలో 12,632 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నగర మేయర్ గద్వాల విజయలక్మ్షి బంజారాహిల్స్ వాక్సినేషన్ సెంటర్‌తో పాటు సనత్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సెంటర్లను పరిశీలించారు.

డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత సికింద్రాబాద్ సర్కిల్‌లోని పలు కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు కేంద్రాలను మేయర్ గద్వాల్ విజయలక్మ్షి, కమిషనర్ లోకేష్ కుమార్‌‌లతో కలిసి సందర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, దిల్‌సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పక్కన ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గోషామహల్ సర్కిల్‌లోని రెడ్ రోస్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు కేంద్రాన్ని, ఖైరతాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు సీతాఫల్ మండి కేంద్రాన్ని పరిశీలించారు. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసి ఫలక్ నూమా సర్కిల్‌లోని పలు కేంద్రాలను పరిశీలించారు.

Next Story