ఎన్నికలు గ్రేటర్లో.. ప్రచారం జిల్లాల్లో!

by  |
ఎన్నికలు గ్రేటర్లో.. ప్రచారం జిల్లాల్లో!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ :గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జిల్లాల్లో జోరుగా సాగుతోంది. అదేంటి.. గ్రేటర్‌లో ఎన్నికలు జరిగితే, జిల్లాల్లో ప్రచారం చేయడమేంటనేగా మీ సందేహం. అవును నిజమే.. ఎన్నికలు జీహెచ్ఎంసీలో జరుగుతున్నప్పటికీ.. జిల్లాల్లోనే ఆయా పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్నారు.జిల్లాలకు ఎలాంటి సంబంధం లేని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పోస్టులతో సోషల్ మీడియా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో సోషల్ మీడియానే అధిక ప్రభావం చూపుతోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. వాట్సప్.. ఫేస్‌బుక్.. ఇన్‌స్టా గ్రామ్ అంటూ గ్రేటర్ ప్రచారం పర్వం జిల్లాల్లోనూ దూసుకెళ్తోంది. వాస్తవానికి గతంలో ఎన్నికలంటే.. కేవలం వాల్ రైటింగ్, క్లాత్ బ్యానర్లు, కరపత్రాల ద్వారానే ప్రచారం సాగేది. కానీ అనంతర కాలంలో వచ్చిన పరిణామాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు, బోర్డులు, మల్టీకలర్ బ్రోచర్లతో ప్రచారం సాగుతూ వచ్చింది. తాజాగా ఎన్నికల ప్రచారమంతా సోషల్ మీడియా వేదికగానే జరుగుతోంది.

ప్రచార పోస్టులతో హోరెత్తుతున్న గ్రూపులు..

ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్స్ వేదికగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదే తరుణంలో అపొజిషన్ అభ్యర్థులను ట్రోల్ చేయడంలోనూ సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారు. ప్రధానంగా నల్లగొండ, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాల నుంచి గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు.. జిల్లాల్లో స్థానికంగా ఉండే వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో ప్రచారానికి సంబంధించిన ఫొటోలు, మ్యాటర్‌తో నింపేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉండే ఇతర పార్టీల నేతలు కౌంటర్లు ఇవ్వడంతో పెద్ద చర్చకే దారితీస్తోంది. ఒక్కరు పోస్టు పెడితే.. వేల సంఖ్యల్లో కామెంట్లు వచ్చిపడుతున్నాయి.

నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా కన్వీనర్లు..

ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీకి ఒక సోషల్ మీడియా సెల్ ఉంది. ఈ విభాగం రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రత్యేకంగా కన్వీనర్లను ఏర్పాటు చేసుకున్నారు. పొలిటికల్ పార్టీలు, నేతలు చేపట్టిన కార్యక్రమాలు, వారి వాగ్దానాలు, సంక్షేమ కార్యక్రమాలు.. ఇలా అనేక అంశాలపై పోస్టర్లు, అందరికీ అర్ధమయ్యేలా ఆసక్తికరమైన ఫోటోలను సిద్ధం చేసి, వాటిని వారివారి అధికారిక సోషల్ మీడియా పేజీలలో ప్రచారం చేస్తుంది. వాస్తవానికి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండటం.. ఆధునిక సాంకేతిక అరచేతుల్లోకి రావడంతో మొబైల్ వినియోగం పెరిగి పోయింది. దీంతో ప్రతి వ్యక్తి ఇంటర్ నెట్ వినియోగం కామన్ అయ్యింది. దీంతో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. సోషల్ మీడియాలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. పలు పార్టీల నేతల పాత ప్రసంగాలు తీసి, అందులో వారికి అనుకూలంగా ఉండే మాటలను కాస్త ఎడిట్ చేసి, తమ నేతల ప్రసంగాలను జోడించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీంతో అవికాస్త వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో షేర్ అవుతూ పెద్ద చర్చకు దారితీస్తుండటం గమనార్హం.

Next Story