టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్

by  |
టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్
X

దిశ, హుజురాబాద్: కేసీఆర్ బొమ్మతోనే హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందుతానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. పేదింటి బిడ్డనైన తనకు కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చాడని, ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ అండదండలతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

ఈటల స్వార్థంతోనే ఉప ఎన్నిక..

ఈటల స్వార్థంతోనే హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకులు అడ్రస్ లేకుండా పోయారని, భవిష్యత్తులో రాజేందర్‌కు కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. బీజీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటలకు ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలన్నారు.

అనంతరం గంగుల, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఆస్తులు ఎక్కువై సీఎం కావాలనే కుట్రలో భాగంగా తప్పుడు పద్ధతులు అవలంభించి.. కన్నతల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీకీ ఈటల వెన్ను పోటు పొడిచారన్నారు. ఈ కారణంగా వచ్చిన ఉప ఎన్నిక తప్పా.. ప్రజా కోణంలో వచ్చింది కాదన్నారు. 18 ఏళ్లుగా ఈటల చేయని అభివృద్ధిని రెండు నెలల్లో హరీష్ రావు చేసి చూపించారని అన్నారు. గెల్లును గెలిపించి కేసీఆర్‌కు గొప్ప బహుమతిని అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Next Story

Most Viewed