ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. పక్కన్నే పెట్రోల్ బంక్..?

29
fire accident

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణంలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలికి పక్కన్నే పెట్రోల్ బంక్ ఉండటంలో స్థానికులు భయాందోళన చెందారు. అగ్నిమాపక శాఖ చాకచక్యంగా వ్యవహరించి భారీ ప్రమాదాన్ని నిలవరించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ అగ్ని ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి పట్టణంలో కమాన్ చౌరస్తా రాజీవ్ రహదారి మార్గంలో జకోటియా పెట్రోల్ బంక్ పక్కన తాజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళన చెందిన హోటల్ సిబ్బంది, స్థానికలు పరుగులు తీశారు. వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహకుడు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించాడు.

సకాలంలో స్పందించిన అగ్నిమాపక అధికారి శ్రీనివాస్.. సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేస్తూనే పక్కనే ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లను బయటకు తెచ్చారు. మరోపక్క జకోటియా పెట్రోల్ బంక్ వరకు మంటలు వ్యాప్తించడకుండా చాకచక్యంగా మంటలను అదుపు చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి రాజీవ్ రహదారి పక్కనే ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్ఐ సహదేవ్, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.