ధోనీ విధేయతను మర్చిపోను: కిర్‌స్టెన్

by  |
ధోనీ విధేయతను మర్చిపోను: కిర్‌స్టెన్
X

దిశ, స్పోర్ట్స్: 28ఏళ్ల తర్వాత ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్ గెలువడంలో కీలక పాత్ర పోషించిన వారిలో గ్యారీ కిర్‌స్టెన్ ఒకరు. మహీని దగ్గర నుంచి గమనించిన గ్యారీ అతడి గురించి పలు విషయాలను వెల్లడించాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ధోనీ తన పట్ల ఎంతో విధేయతగా ఉండేవాడని అన్నాడు. తన కెరీర్‌లో చూసిన అత్యుత్తమ వ్యక్తుల్లో ధోనీ ఒకడని ఆయన చెప్పాడు. మైదానంలో జట్టును నడిపించడంలోనే కాదు. బయట కూడా నిజమైన నాయకుడిగా వ్యవహరించే వాడన్నాడు. ఇందుకు ఒక ఉదహరణ చెప్పాడు. ‘ప్రపంచకప్‌కు ముందు మేమందరం బెంగళూరులో శిక్షణ కార్యక్రమంలో ఉన్నాం. ఆ సమయంలో ఒక ఎయిర్ స్కూల్‌ను సందర్శించడానికి జట్టుకు ఆహ్వానం అందింది. టీమ్‌ సభ్యులు అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. విదేశీయులమైన నాకు, పాడీ ఆప్టన్, ఎరిక్ సిమ్మన్స్‌లకు అక్కడికి అనుమతి లేదని సమాచారం వచ్చింది. విషయం తెలిసిన ధోనీ మొత్తం టూర్‌నే రద్దు చేశాడు. అప్పుడు మహీ చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. వీళ్లు నా వాళ్లు. వాళ్లనే అనుమతించకపోతే మేం కూడా రావడం లేదు అని వారితో తేల్చి చెప్పాడు. ఇది ధోనీ వ్యక్తిత్వం’ అని గ్యారీ చెప్పుకొచ్చాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ గెలిచాక, గ్యారీ కిర్‌స్టెన్‌ హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. అతడి శిక్షణలో భారత్‌ టెస్టుల్లో నంబర్‌ వన్‌గా ఎదగడమే కాకుండా, 2011లో వన్డే ప్రపంచకప్‌ సాధించింది.

Next Story