దొంగ నోట్ల ముఠా@ కాల్వశ్రీరాంపూర్ అడ్డ

70
ACP Sarangapani

దిశ, పెద్డపల్లి : దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును సుల్తానాబాద్ పోలీసులు ఛేదించారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.77,400 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ సారంగపాణి కేసు వివరాలు వెల్లడించారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారనే సమాచారం మేరకు సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది సుల్తానాబాద్ పట్టణంలోని చెరువు కట్ట వద్ద మాటు వేసి కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన చల్లా రాయమల్లు, దారంగుల వెంకటి, బసంతనగర్ జి.డి నగర్‌కు చెందిన కొమిరే రాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.77 వేల 400 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారన్నారు.

fake currency

వారిని విచారించగా.. కరీంనగర్‌లో నకిలీ నోట్లు ముద్రిస్తున్నారనే సమాచారం ఇచ్చారు. దీంతో కరీంనగర్‌లో కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన దుగ్యాల అనిల్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు నకిలీ నోట్లు ముద్రిస్తున్న ప్రింటర్, స్కానర్, కట్టర్‌తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠాలో కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన పెండం నగేష్ కూడా ఉన్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.