గగన్‌యాన్ వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన

by  |
గగన్‌యాన్ వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులతో భారత తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్‌యాన్‌ను ఏడాది వాయిదా వేస్తున్నట్లు ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తెలిపింది. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్. భూమికి సమీపంలోని కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములను పంపించి, తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావడం ఈ యాత్ర ముఖ్యోద్దేశం. ఈ యాత్రను వచ్చే 2021, డిసెంబర్‌లో చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

గగన్‌యాన్‌ కంటే ముందు రెండు మానవ రహిత యాత్రలు అవసరం. ఈ నెలలో తొలి ప్రయోగం, వచ్చే ఏడాది జూలైలో రెండో ప్రయోగం చేపట్టాల్సి ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులతో అంతరిక్ష యాత్రలను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. గగన్‌యాన్‌లో భాగంగా చేపట్టాల్సిన తొలి మానవ రహిత యాత్రను వచ్చే ఏడాది డిసెంబర్‌లో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. గగన్‌యాన్ కోసం గత నెలలో భారీ ప్రయోగాల కోసం వినియోగించే జీఎస్‌ఎల్‌వీ ఎంకేIII‌ను గుర్తించింది. ఈ యాత్ర కోసం వ్యోమగాముల అన్వేషణ కొనసాగుతుందని ఇస్రో పేర్కొంది.

చంద్రుడిపైకి ల్యాండర్‌, రోవర్‌ను ప్రయోగించే చంద్రయాన్ మిషన్ పనులు కొనసాగుతున్నాయని, ఇంకా ప్రయోగ తేదీని నిర్ణయించలేదని కే శివన్ తెలిపారు. మరోవైపు శుక్రయాన్ ప్రయోగాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగం 2023, జూన్ వరకు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రుడు 19 నెలలకు ఒక్కసారి భూమి సమీపంలోకి వస్తాడు. ఆ సమయంలో ప్రయోగాలు చేపట్టేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో శుక్రయాన్‌ ప్రయోగాన్ని 2024 లేదా 2026లో చేపడుతామని కే శివన్ తెలిపారు. శుక్రగ్రహం ఉపరితలం పరిశీలించడం కోసం ‘శుక్రయాన్‌’కు ఇస్రో రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు కోసం రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీల సహాయ సహకారాలను తీసుకోనుంది. ఇందులో భాగంగా నాలుగేళ్లలో 20 అంతరిక్ష ప్రయోగాలు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story