హాట్ స్పాట్ గా గద్వాల

by  |
హాట్ స్పాట్ గా గద్వాల
X

దిశ, మహబూబ్ నగర్: నిత్యం అధికారుల పర్యవేక్షణ.. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు.. వలస వస్తున్న వారి గుర్తింపు.. జాగ్రత చర్యలు.. అయినా కూడా కరోనా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై తన పంజా విసిరింది. వారం రోజుల కిందటి వరకు పరిస్థితి ఒక విధంగా ఉంది. వారం తరువాత పరిస్థితి అంతా తారుమారు అయ్యింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన వారం రోజుల వరకు కూడా కేవలం 2 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అది కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టులో విధులు నిర్వహించిన వ్యక్తితోపాటు అతని తల్లికి రావడం జరిగింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వరకు జిల్లాలో కేసుల సంఖ్య పెద్దగా ఉండవనే భావన ధీమా అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వ్యక్తం చేశారు. కానీ, సరిగ్గా వారం తిరిగే లోపే 15 కేసులు నమోదు కావడం యావత్తు జిల్లా ప్రజలను వణికిస్తోంది. చివరకు ఒక ప్రాంతాన్ని ప్రభుత్వం హాట్ స్పాట్ గా కూడా ప్రకటించే పరిస్థితి నెలకుందంటే పరిస్థితి తీవ్రతను చెప్పవచ్చు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను పరిగణలోకి తీసుకుంటే ఇంత వరకు నారాయణపేట, వనపర్తి జిల్లాలో మాత్రమే ఎలాంటి కేసులు నమోదు కాకపోగా మిగిలిన మహబూబ్ నగర్ జిల్లాలో 7 కేసులు, గద్వాలలో 6 కేసులు, నాగర్ కర్నూల్లో 2 కేసులు నమోదు కావడం జరిగింది. ఇంకా మహబూబ్ నగర్ పరిధిలో 30, జోగుళాంబ గద్వాలలో 41, నాగర్ కర్నూల్లో 1 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి వుంది. ముఖ్యంగా ఢిల్లీలోని మర్కజ్ వెళ్ళి వచ్చిన వారి నుండి అనూహ్యంగా ఈ కేసుల సంఖ్య పెరిగిందని అధికారులు గుర్తించారు.

దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 35 మంది వెళ్ళినట్లు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా వున్నాయి. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు అసలు ఎంత మంది ఢిల్లీ వెళ్ళారనే విషయంపై ఆరా తీస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఈ సంఖ్య వందకు పైగానే వుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హాట్ స్పాట్..

గద్వాలలో క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గద్వాలను ప్రభుత్వం హాట్ స్పాట్ గా ప్రకటించింది. దీంతో వైరస్ సోకిన వ్యక్తి నివాసం వుండే ప్రాంతం నుండి సుమారు రెండు కిలోమీటర్ల వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ వుంటుంది. అలాగే ఈ ప్రాంతం నుండి ఎవ్వరు కూడా బయటకు వెళ్ళడం, లేదా బయటి వారిని లోపలికి రానివ్వడం కాని జరగదు. ప్రస్తుతానికి మహబూబ్ నగర్ జిల్లాలో 14 మంది ఐసోలేషన్లో వుంచి పర్యవేక్షిస్తుండగా అనుమానం వున్న మరో 221 మంది హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అదే సమయంలో గద్వాలలో పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు చెందిన సుమారు 24 మందిని ఐసోలేషన్ కు తరలించగా నాగర్ కర్నూల్ జిల్లాలో సుమారు 34 మందిని క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.

అసహనం వ్యక్తం..

అదే విధంగా పాజిటివ్ వచ్చిన వారు ఎవ్వరెవ్వరిని కలిశారు.. ఎక్కడెక్కక్కడ తిరిగారు.. వారితో సన్నిహితంగా మెలిగినవారు ఎవ్వరు అనే విషయాలపై ఇంకా ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం కుటుంబసభ్యులకే ఈ వైరస్ పరిమితం అయినా కూడా అధికారులు ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. అయితే ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్టేజ్-2 కొనసాగుతుందని, ఇది ఒక రంకంగా డేంజర్ బెల్స్ మోగినట్లేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ప్రకటించారు. కావున ప్రజలు ఎంత జాగ్రతగా ఉంటే అంత మంచిదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజలకు ఎంతగా చెబుతున్నా కూడా వాళ్లు గుంపులు గుంపులుగా వెళ్ళడం మానుకోకపోవడంపై అయన అసహనం వ్యక్తం చేశారు.

Tags: Mahabubnagar, hotspot, corona Effect, officers, police, ministers

Next Story

Most Viewed