బీబీసీ ఉమెన్ 100లో సింగర్ ‘ఇసైవని’

by  |
బీబీసీ ఉమెన్ 100లో సింగర్ ‘ఇసైవని’
X

దిశ, వెబ్‌డెస్క్: బీబీసీ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన, స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి వారి జాబితా రూపొందిస్తుంది. మహిళలు సాధించిన విజయాల‌పై, వారు ప్రభావం చూపించిన అంశాలపై ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలతో పాటు ఇంటర్వ్యూలను అందిస్తుంది. ఈ ఏడాది ‘మార్పును సాధ్యం చేసిన మహిళలు’ అనే కాన్సెప్ట్ తీసుకోగా, గానా సింగర్ ఇసైవని ఆ 100 మందిలో ఒకరిగా నిలవడం విశేషం. ఎక్కువగా మగవాళ్ల గాత్రంతోనే పేరుపొందిన ‘గాన పట్టు’ పాటలను వారితో కలిసి ఒకే వేదిక మీద పాడటమే గొప్ప విషయం అనుకుంటే.. ఇసైవని ఆ సంప్రదాయపు అడ్డుగోడలను దాటుకొని వచ్చి విశేషంగా రాణిస్తూ, ఇతర యువ గాయనీమణులకు స్పూర్తిగా నిలిచినందుకు బీబీసీ ‘ఉమెన్ 100-2020’లో స్థానం కల్పించింది.

చెన్నై‌లో అంతా నివర్ తుపాన్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో, సింగర్ ఇసైవనిని మరో సైక్లోన్ తాకింది. ఆ తుఫానే ‘బీబీసీ 100 ఉమెన్ -2020’ గుర్తింపు. ఆ జాబితాలో తన పేరుండటంతో గత నాలుగు రోజులుగా ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడుకు చెందిన ఇసైవనికి చిన్ననాటి నుంచే పాటలు పాడటమంటే ఎంతో ఇష్టం. చెన్నై బేస్డ్ తమిళ్ ఇండీ బ్యాండ్ ‘ద క్యాస్ట్‌లెస్ కలెక్టివ్’లో ఏకైక మహిళా సింగర్ తనే కాగా, ఈ బ్యాండ్ నేతృత్వంలో ఇప్పటివరకు 35 పాటలు విడుదలయ్యాయి.

అట్టడుగు సమాజం, కార్మికవర్గ నేపథ్యం నుంచి వచ్చిన ఓ మహిళ.. స్టేజి ఎక్కి పాడగలదా? తన వాయిస్‌తో అందరిలోనూ ఆ పాట ప్రభావాన్ని నింపగలదా? ఇలా ఆమె మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తినా, అదంతా ఈజీ కాదని తెలిసినా.. ఒక ముందడుగు వేయాలనుకుంది. సంకల్పం ముందు ఏదైనా సాధ్యమేనని నమ్మి.. తన ప్రతిభతో సంప్రదాయ గోడలను బద్దలుకొట్టాలనుకుంది. అలా మొదలైన ప్రస్థానం.. తన గొంతుతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాదు, మరెందరో యువ గాయనీమణులకు ఓ కొత్త దారిని చూపేలా చేసింది. ఇసైవనిది దళిత నేపథ్యం కావడంతో.. అణగారిన కథలను పంచుకోవడానికి తన గొంతును, గాన సంగీతాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంది. తమిళనాడులో ‘గానా’ పాటలు ఎక్కువగా మగవాళ్లే పాడేవాళ్లు. గాన పట్టు అనేది స్టైల్ ఆఫ్ తమిళ్ మ్యూజిక్. చెన్నై వీధుల్లో ప్రారంభమైన ఈ తరహా సంగీత నేపథ్యంతో కూడిన పాటలను ఎక్కువగా మరణించినవారి జ్ఞాపకార్థం లేదా జీవనోపాధి గురించి రాసేవాళ్లు. ఇవే తర్వాతి రోజుల్లో సామాజిక అంశాలను, అన్యాయాలను ప్రశ్నించే పాటలుగా మారాయి. గాన పాటలు పాడే అవకాశం వచ్చినప్పుడు.. ‘ఇది ఉమెన్ వరల్డ్’ కాదని అన్నవాళ్లకు తన పాటతో, విజయాలతో సమాధానం ఇవ్వాలనుకున్న ఇసైవని.. ‘బీబీసీ 100 ఉమెన్’లో స్థానం సంపాదించి మాట నిలబెట్టుకుంది. గాన పాటలతో పాటు ‘ద క్యాస్ట్‌లెస్ కలెక్టివ్‌’లోనూ తన సత్తా చాటుతోంది. ఇసైవని తండ్రి శివకుమార్ మ్యూజిషియన్, కీబోర్డ్ ఆర్టిస్ట్ కావడంతో.. చిన్నతనంలోనే ఆయన దగ్గర సంగీత మెళకువలు నేర్చుకుని ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టిన ఇసైవని.. 17 ఏళ్ల నుంచి ప్రతి నెలా 5, 6 వేదికలపై పాటలు పాడుతోంది.

‘పురుషాధిక్య సమాజంలో దళిత మహిళల గొంతులు వినిపించడం చాలా తక్కువ. అయితే నేను స్టేజి మీద కాన్ఫిడెన్స్‌గా పాడటంలో సక్సెస్ కావడం.. మహిళా సాధికారితకు చిహ్నంగా, అట్టడగు మహిళలకు విముక్తిగా భావిస్తున్నాను. 2020లో ప్రపంచం చాలా మారిపోయింది. అయితే మహిళలకి ప్రపంచం రోజూ మారుతూనే ఉంది. మహిళలు సిద్ధాంతాలని మారుస్తున్నారు, పురుషాధిక్య ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నారు. రాబోయే తరాల్లో ఇది నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది’ అని ఇసైవని తెలిపింది.


Next Story

Most Viewed