‘పాలమూరు’కు తగ్గిన నిధుల ఎత్తిపోత

by  |
‘పాలమూరు’కు తగ్గిన నిధుల ఎత్తిపోత
X

దిశ, మహబూబ్‌నగర్: సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తోందనీ, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంత వరకు ఒక్క ప్రాజెక్టు పనులు కూడా పూర్తి కాలేదనీ, అవి పూర్తయ్యేందుకు నిధులు పూర్తిస్థాయిలో కేటాయించకపోగా, గతేడాది సవరించిన బడ్జెట్ కంటే కూడా ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. ప్రస్తుత పద్ధతిలో నిధుల కేటాయింపులు జరిగితే ప్రాజెక్టుల పనులు ముందుకు సాగే పరిస్థితి ఎలా ఉన్నా దశాబ్దం గడిచినా పనులు పూర్తి అయ్యే పరిస్థితులు కనిపించడంలేదని చెబుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గతేడాది రూ.500 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.368.58 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. హడావిడిగా ప్రాజెక్టు సర్వే పనులు చేయడంతోపాటు ప్రాజెక్టును రీడిజైన్ చేయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.50 వేల కోట్లు అవుతుందని అంచనాలు ఉండగా ఇప్పటివరకు ప్రభుత్వం దాని కోసం ఖర్చు చేసింది రూ.10 వేల కోట్లు కూడా దాటకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే దీని కింద లక్షా 30 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఈ ప్రాజెక్టుల కింద భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే ప్రాజెక్టు కింద వున్న ఉదండాపూర్, వల్లూరు, శంకరాయపల్లి తదితర గ్రామాల ప్రజలు పరిహారంలో వ్యత్యాసం పై అందోళన బాట పట్టారు. ఉదండాపూర్ జలాశయం పనులు అంజనగిరి, వట్టెం, కరెవన జలాశయాల పరిధిలో సొరంగం, కాలువలు, పంపుహౌస్ పనులు నతనడకన నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద పనిచేస్తున్న చాలామంది గుత్తేదారులు తమకు రావాల్సిన బిల్లులు చెల్లింపులు ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే నేపంతో పనులను మందకొడిగా సాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో గుత్తేదారులు కేవలం మట్టి పనులు చేస్తు మమా.. అనిపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇప్పటికే కాంట్రాక్టర్లకు రూ.1,857 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

‘గట్టు’ ప్రస్తావనేది?

పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో సంబంధం లేకుండా మిగతా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలంటే కనీసం రూ.2300 కోట్ల మేరకు నిధులు అవసరం ఉండగా ప్రభుత్వం నుంచి కేవలం రూ.81.62కోట్ల నిధులు రావడం గమనార్హం. స్వయంగా సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు ఎంతో అర్భాటంగా శంకుస్థాపన చేసిన గట్టు ఎత్తిపోతల పథకం గురించి బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేదు. జూరాల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 11 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో కేవలం 6.50 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత ఇంత వరకు పూడికతీత పనులు చేపట్టలేదు. అయితే, గతేడాది కంటే బడ్జెట్‌లో నిధులు పెంచకపోగా, కేటాయింపులు తగ్గించడం ద్వారా గుత్తేదారులు ప్రస్తుతం కొనసాగిస్తున్న పనులను నిలిపేస్తారా అనే అనుమానాలు వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags: palamuru rangareddy project, funds, telangana budget

Next Story

Most Viewed