అదే జోరు.. ముధోల్‌ను ముంచెత్తిన వర్షాలు

by  |
అదే జోరు.. ముధోల్‌ను ముంచెత్తిన వర్షాలు
X

దిశ, ముధోల్ : బైంసా డివిజన్ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. దీంతో సోమవారం రాత్రి ఆరు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలారు.ఇన్ ఫ్లో 79,452 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. ఔట్ ఫ్లో 79,452 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 358.70 మీటర్లు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. ఇలాదిగువకు నీటిని వదలడంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా వుండాలని, అంతేకాకుండా రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలియజేశారు. ఇప్పటికే తాలూకాలోని పలు ఇండ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. ఇంకావర్షం కురుస్తూనే ఉండటంతో మరల మంగళవారం ఉదయం 5 గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై నెలలో పడిన వర్షాలకు రైతు పంట నష్టపోగా తాజాగా పండగ ముందు ఇంటికి వచ్చే ధాన్యం కూడా నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినుము, కంది, పత్తి ఇప్పటికే నేలకు ఒరిగాయని కొందరు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

బైంసాలో రికార్డు స్థాయి వర్షపాతం..

సోమవారం రాత్రి నుండి ఎడతెరిపిలేకుండా వర్షంతో బైంసా పట్టణంలో 164.8 మీ.మీతో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. పట్టణంలోని పలు కాలనీలు, కూడళ్లలో రోడ్లన్నీ జలమయం కాగా, ఎన్‌ఆర్ గార్డెన్ సమీపంలోని బ్రిడ్జి పూర్తిగా నీటితో మునిగిపోయింది. పట్టణంలోని ఓప్రైవేట్ బడి కాస్తా నీటితో నిండి స్విమ్మింగ్ పూల్‌గా మారింది. బైంసా మండలంలోని గుండెగాం పూర్తిగా నీటితో నిండిపోయింది. గ్రామంలోని ఇళ్లన్నీ నీటితో నిండిపోగా ఓ ఇంటి యజమాని తర్మకోల్‌ పడవ రూపంలో వాడుతూ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశాడు.

Next Story

Most Viewed