ఇక నుంచి గాంధీలోనే జీనోమ్ సీక్వెన్సీ టెస్టులు

by Anukaran |   ( Updated:2021-12-20 20:40:33.0  )
ఇక నుంచి గాంధీలోనే జీనోమ్ సీక్వెన్సీ టెస్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కొత్త వేరియంట్​లను గుర్తించేందుకు నిర్వహించే జీనోమ్ సీక్వెన్వీ (జన్యు విశ్లేషణ) పరీక్షలు ఇక నుంచి గాంధీ ఆస్పత్రిలో జరగనున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా గాంధీ ఆసుపత్రిలో జన్యు విశ్లేషణ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ప్రభుత్వ అనుమతి అనంతరం గాంధీ మైక్రోబయాలజీ ల్యాబ్‌లో సోమవారం జీనోమ్ ట్రయిల్ నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రతీ 48 శాంపిల్స్​కు ఒకసారి టెస్టింగ్​ ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. ఉదయం సేకరించిన శాంపిల్స్​కు సాయంత్రం వరకు రిపోర్టులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. నాలుగు నెలలకు సరిపడా కిట్లు, ద్రావణాలను అందుబాటులో ఉంచామన్నారు. దీంతో వేగంగా ఒమిక్రాన్​ వేరియంట్​ను గుర్తించవచ్చన్నారు.

3 రోజులు వేచిచూడాలి..

ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే వారు కరోనా పాజిటివ్‌గా తేలితే నమూనాలు తీసుకొని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ(సీసీఎంబీ), సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయోగ్నోసిస్‌(సీడీఎఫ్‌డీ)కు పంపుతున్నామని డా. రాజారావు తెలిపారు. అయితే అక్కడ నుంచి రెండు నుంచి 3 రోజుల తర్వాత ఫలితాలు అందుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఎక్కువ నమూనాలు విశ్లేషించడంలో జాప్యం జరుగుతున్నదన్నారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో ఈ అత్యాధునిక టెస్టింగ్​ సేవలను తీసుకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. టెస్టింగ్ ప్రక్రియలో సీసీఎమ్‌బీ సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. దీంతో జీనోమ్​ సీక్వెన్సింగ్​ టెస్టింగ్​ తిప్పలు తప్పనున్నాయన్నారు.

జన్యువులను గుర్తిస్తారు

జీనోమ్​ సీక్వెన్సింగ్​ టెస్టింగ్​ విధానంలో వైరస్​ల జన్యుపదార్ధాలను గుర్తించవచ్చు. వాటి జాతులను తెలుసుకునేందుకు ఈ టెస్టింగ్​ ప్రక్రియ ఉపయోగపడుతుంది. జీనోమ్ లో తేలిన జన్యువులు ఆధారంగా వైరస్​లను గుర్తిస్తారు.అయితే తొలుత ఆర్టీపీసీఆర్‌ విధానంలో పరీక్షించి ఆ తర్వాత వైరస్‌ కణ నిర్మాణానికి సంబంధించి ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏలతోపాటు అమినోయాసిడ్స్‌ ను పరిశీలిస్తారు. అయితే జీనోమ్​ లో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో నమూనాలు విశ్లేషించడానికి వీలు ఏర్పడుతుంది. ప్రస్తుతం గాంధీలో కేవలం 27 మంది వరకు కరోనా బాధితులు ఉండగా, అన్నీ డెల్టా వేరియంట్‌ కేసులేనని డా.రాజారావు తెలిపారు.

సర్కార్‌కు షాక్.. ప్రమోషన్లతో కొత్త చిక్కులు

Next Story

Most Viewed