కోతల పేరుతో రైతులను దోచుకుంటున్న మిల్లర్లు.. రోడ్డెక్కి రైతన్న ధర్నా

by  |
కోతల పేరుతో రైతులను దోచుకుంటున్న మిల్లర్లు.. రోడ్డెక్కి రైతన్న ధర్నా
X

దిశ, మల్లాపూర్ : కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను తట్టుకోలేక 300 మందికిపైగా రైతన్నలు రోడ్డుపై బైఠాయించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి కోతల రూపంలో రైతన్న కంటతడి పెట్టేలా సొసైటీ నిర్వాహకులు, మిల్లర్ల యాజమాన్యం ప్రవర్తిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఏడు లారీల కన్నా ఎక్కువ ధాన్యం మిల్లర్‌లకి పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్ మండలంలోని కొత్త ధామ్‌రాజ్‌పల్లి, సంగెం శ్రీరాంపూర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన పీఎసీఎస్ కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు.

తాము కష్టపడి పండించిన పంటకి ఎవరో పెత్తందారిగా వ్యవహరిస్తూ రాజరిక పాలన కొనసాగించేలా కోతల రూపంలో తమకు అన్యాయం చేస్తున్నారని రైతన్న వివరించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సమయంలో బస్తాకి 41 కిలో తూకం వేస్తామని చెప్పిన యాజమాన్యం.. తీరా కొనుగోలు కేంద్రాలలో రోజులు గడిచేకొద్దీ 43 కిలోలకి పెంచి నష్టాల ఊబిలో నెట్టుతున్నారని వాపోయారు. సొసైటీ సభ్యులు మిల్లర్లతో కుమ్మక్కై ఒక క్వింటాలుకి 5 కిలోల చొప్పున కోతలు కోస్తున్నారు. కాంటా అయిన బస్తాలని 20 రోజులైనా తరలించడం లేదని, కొనుగోలు కేంద్రాలలో దాదాపుగా మూడు వేల బస్తాలకు పైగా అలానే ఉన్నాయని వారు ఆరోపించారు.

ఇదంతా పీఎసీఎస్ నిర్వాహకుల జాప్యంతోనే జరుగుతున్నదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 25 రోజులు గడుస్తున్నా అధికారుల పర్యవేక్షణ మాత్రం లేదని వాపోయారు. అధికారుల పర్యవేక్షణ ఉంటే తమకు న్యాయం జరిగేదని అన్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలలో జాప్యం జరగకుండా, కోతలు కోయకుండా, రైతులను ఆదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో రైతన్న ధర్నాని విరమించుకున్నారు.


Next Story