మీరేం మనుషులురా బాబు.. నమ్మి ఉద్యోగమిస్తే నట్టేట ముంచుతారా..!

by  |
మీరేం మనుషులురా బాబు.. నమ్మి ఉద్యోగమిస్తే నట్టేట ముంచుతారా..!
X

దిశ, సైదాపూర్ : సైదాపూర్ మండలంలో ఫ్లిప్‌కార్ట్ పేరిట ఘరానా మోసాలకు పాల్పడుతున్న కొరియర్ బాయ్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి సైదాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మండల కేంద్రానికి చెందిన నీర్ల కళ్యాణ్, అనగోని వికాస్, కునుకుంట్ల అనిల్, తూటి వినయ్ హుజరాబాద్ పట్టణంలోని లార్జ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బాయ్స్‌గా గత మూడు నెలల నుండి పని చేస్తున్నారు.ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా కంపెనీకి సంబంధించిన కొరియర్స్‌లోని వస్తువులను దొంగిలించాలని నిర్ణయించుకున్నారు.

వాటి స్థానంలో రాళ్లు, చపాతి బండలు, పెంకులు పెట్టి కస్టమర్లకు ఇచ్చేవారు. అలా దొంగిలించిన వస్తువులను అమ్ముకొని తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీళ్లు దొంగిలించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్స్ వాటి విలువ సుమారు రూ.9లక్షలు ఉంటుందని సమాచారం. అయితే, వరుసగా సైదాపూర్ పరిధిలో నుంచి కస్టమర్లు ఫిర్యాదు చేస్తుండటంతో స్పందించిన ఫ్లిప్‌కార్టు మేనేజ్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దొంగిలించబడిన సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో హుజూరాబాద్ రూరల్ సీఐ ఎర్రల కిరణ్, సైదాపూర్ ఎస్ఐ బండ ప్రశాంత రావు, ట్రైనీ ఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్స్ రాజు, పార్థసారథి, కుమార్, రంజిత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story