కమలం గూటికి ‘పటేల్’?

by  |
కమలం గూటికి ‘పటేల్’?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు భోంస్లే నారాయణ‌రావు పటేల్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దుబ్బాక అసెంబ్లీ బై ఎలక్షన్‌లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ గెలుపు ఎఫెక్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక రాజకీయ పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. 1994, 2004 సాధారణ ఎన్నికల్లో రెండు సార్లు ముధోల్ నుంచి నారాయణరావు పటేల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత 2004లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2018 ఎన్నికల్లో నారాయణరావుకు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. తనకు వరుస సోదరుడైన రామారావు పటేల్‌కు కాంగ్రెస్ టికెట్ దక్కింది. దీంతో నారాయణ‌రావు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) టికెట్‌‌పై పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు.

మళ్లీ క్రియాశీలకంగా మారేందుకు..

ముధోల్‌ ప్రజల్లో బలమైన పట్టున్న నేతగా నారాయణ‌రావు పటేల్‌కు పేరుంది. నియోజకవర్గంలో ఆరె మరాఠాల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వారిలో నారాయణరావు పటేల్‌కు గట్టిపట్టు ఉంది. అందుకే ఇక్కడ క్రియాశీలకంగా మారేందుకు పటేల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకు కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. నారాయణరావు పటేల్ తెలంగాణ బీజేపీ అగ్రనేత ఒకరితో టచ్‌లో‌కి వెళ్లినట్లు తెలిసింది.రెండ్రోజుల్లో రాష్ట్ర అధిష్టానంతో హైదరాబాద్‌లో సమావేశం అవుతారని పటేల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆ నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పటేల్ చేరికను అడ్డుకుంటారని తెలుస్తోంది. ఆదిలాబాద్‌కు చెందిన సీనియర్ బీజేపీ నేత ఒకరు ఈ ఇద్దరి నడుమ సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పటేల్ బీజేపీలో చేరితే ముధోల్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమలం పార్టీ ఇంకా బలపడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


Next Story

Most Viewed