బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి..?

by  |
ex MLA shashidhar-reddy
X

దిశ, మెదక్ : సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే కాంగ్రెస్ తరుపున శశిధర్ తమ్ముడు పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టాన వర్గం టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, ఇతర పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం తమ్ముడు అయిన ఉపేందర్ రెడ్డి కి శశిధర్ రెడ్డి మద్దతిచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై ఉపేందర్ రెడ్డి ఓడిపోయారు. ఉపేందర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

ఇదిలా ఉండగా.. ఎన్నికల అనంతరం ముఖ్య అనుచరులతో శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. నెల రోజుల క్రితం వరకు బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడం, ముఖ్యంగా శశిధర్ రెడ్డి మిత్రుడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సురేష్ షేట్కర్‌ ఎన్నిక కావడంతో శశిధర్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా మళ్లీ శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర మెదక్ వరకు వచ్చినప్పటికీ కనీసం బండిని మర్యాదపూర్వకంగా కూడా ఆయన కలవలేదు. దీంతో శశిధర్ రెడ్డి పార్టీ మారనున్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆయన ముఖ్య అనుచరులు ఎవరు కూడా పాదయాత్రలో పాల్గొనలేదు.

మంబోజిపల్లి లో ఎన్‌డీ‌ఎస్ కార్మికులతో సోమవారం సాయంత్రం బండి సంజయ్ మాట్లాడినప్పుడు కూడా శశిధర్ రెడ్డి అటు వైపు రాలేక పోవడంతో, త్వరలో శశిధర్ రెడ్డి బీజేపీకి రాంరాం చెప్పనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ శశిధర్ రెడ్డికి రాష్ట్ర కార్యవర్గంలో సైతం అవకాశం కల్పించింది. బీజేపీలో ఇముడ లేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అంటున్నారు. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా పారిశ్రామిక వేత్త వై.ప్రభాకర్ రెడ్డికి మెదక్ అసెంబ్లీ టికెట్ టీఆర్ఎస్ కు కేటాయించింది. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా శశిధర్ రెడ్డి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి పై గెలిచారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా శశిధర్ రెడ్డిని అసెంబ్లీలో కొనసాగించారు.

గతంలో శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మంచిపట్టు ఉన్నప్పటికీ, తన సినీ గ్లామర్, ఢిల్లీ రాజకీయాలతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుండి 2014లో మెదక్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ తెచ్చుకొని, టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అంతేకాకుండా తన ఓటమికి శశిధర్ రెడ్డి కారణమని కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి విజయశాంతి ఫిర్యాదు చేశారు. గత డిసెంబర్‌లో విజయశాంతి సైతం బీజేపీలో చేరడంతో తనకు వచ్చే ఎన్నికలలో మెదక్ ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంటుందని శశిధర్ రెడ్డి ముందే ఊహించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed