అక్కడ కూడా ఇలానే చేసి.. బొక్కా బోర్లా పడ్డారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

by  |
Guttha-1
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేక.. ఓర్వలేకనే కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతూ పాదయాత్రలు చేస్తున్నాయని, ఇది దురదృష్టకరమని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని నిలువు దోపిడీ చేసినవారు ఇవాళ మారు పేర్లతో, దొంగ ప్రేమతో మళ్ళీ తెలంగాణను దోచుకోవాలని తమ నాటకాలను ప్రారంభించారని తెలిపారు. రాయలసీమ డీఎన్ఏ ఉన్న వైఎస్ షర్మిల తెలంగాణా ఆడబిడ్డ ఎలా అవుతారని, ఆమె పాదయాత్ర ఎందుకో ఎవ్వరికీ అర్ధం కావడం లేదన్నారు. కుటుంబ పాలన అంటూ షర్మిల ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, హైదరాబాద్ లో, తెలంగాణలో పెత్తనం కోసం షర్మిల పాదయాత్ర చేస్తున్నదని, దోచుకోవాలన్నదే ఆమె అసలు ఉద్దేశమని ఆయన అన్నారు. బండి సంజయ్, రేవంత్, షర్మిల.. వీళ్లంతా దుర్భుద్ధితో తెలంగాణ వనరులను దోచుకోవాలని పాదయాత్రలు, రాజకీయాలు చేస్తున్నారని, అత్యాశకు పోతున్నారని చెప్పారు. ధరణి పోర్టల్ తో పారదర్శకత వచ్చిందని, ధరణి పోర్టల్ మీద కూడా ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఎప్పుడో ఖాయం అయిందని, ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ దే విజయమన్నారు. బీజేపీ కేంద్రంలోని ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని కుటిల యత్నాలు, కుట్రలు చేస్తున్నదన్నారు. చివరకు ఘర్షణలు ప్రేరేపించేలా బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని, పశ్చిమబెంగాల్ లో కూడా ఇలానే కుటిల యత్నం చేసి బీజేపీ బొక్కా బోర్లా పడ్డదని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ పప్పులు ఉడకబోవని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదన్నారు. బీజేపీ నేతలు పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇంధన ధరలు భగ్గుమంటున్నాయని, ఫలితంగా నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని చెప్పారు. వాటిపై బీజేపీ మాట్లాడబోదని, బీజేపీకి ప్రజా సమస్యలు పట్టవని, తెలంగాణను అతలాకుతలం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని తెలిపారు. బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, కేంద్రం చేతులెత్తేసినా ఈ వానాకాలం ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటున్నదని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనమన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ.. మిర్యాలగూడ, దేవరకొండ, నియోజకవర్గలాల్లో ఇచ్చిన మాట నిలుపుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ లిఫ్ట్ లను మంజూరు చేశారని గుర్తు చేశారు. నిన్ననే టెండర్ లు కూడా పిలిచారని, మరికొద్ది రోజుల్లో పనులు కూడా ప్రారంభం అవుతాయని, ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed