స్లీపింగ్ చాలెంజ్.. విన్నర్‌కు రూ.10 లక్షలు

by  |
స్లీపింగ్ చాలెంజ్.. విన్నర్‌కు రూ.10 లక్షలు
X

దిశ, ఫీచర్స్: మీకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టమా? రోజుల తరబడి నిద్రపోయే సత్తా మీలో ఉందా? అయితే మీకు ఉద్యోగం లభించినట్లే! అదేంటీ.. నిద్రపోవడం కూడా ఓ పనేనా? నిద్రపోయినందుకు ఎవరైనా డబ్బులిస్తారా? అనుకోకండి.. మీరు చదివింది నిజమే, స్లీపింగ్‌ను చాలెంజ్‌గా నిర్వహిస్తోంది ఓ సంస్థ. ఇందుకోసం మక్కువగా నిద్రపోయే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్న్‌షిప్ చేసే వారికి రూ.1 లక్ష, ఈ చాలెంజెస్ అన్నీ క్లియర్ చేసి ‘ఇండియాస్ స్లీప్ చాంపియన్ (India’s Sleep Champion)గా నిలిచిన వారికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. ఆ వివరాలు మీ కోసం..

సాధారణంగా నిద్రపోయే జాబ్ ఉంటే ఎంత బాగుండునో అని చాలా మందే అనుకుంటుంటారు. కాగా బెంగళూరుకు చెందిన స్లీప్ అండ్ హోం సొల్యూషన్స్ కంపెనీ వేక్‌ఫిట్ (Wakefit) అలాంటి డ్రీమ్ జాబ్‌ను ఆఫర్ చేస్తోంది. 2016లో అంకిత్ గార్గ్, చైతన్య రామలింగె గౌడ ఈ వేక్‌ఫిట్ కంపెనీని ప్రారంభించారు. పిల్లోస్, కంఫర్టర్స్, మ్యాట్రెసెస్ (దుప్పట్లు) తదితర ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు బెటర్ స్లీప్ అందించడమే కంపెనీ లక్ష్యం. ఈ క్రమంలో గతేడాది స్లీపింగ్ చాలెంజ్‌ను నిర్వహించిన వేక్‌ఫిట్.. దానికి కొనసాగింపుగానే ఈ ఏడాది రెండో ఎడిషన్ స్లీప్ ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు వేక్‌ఫిట్ మ్యాట్రెస్‌లో వంద రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రించాలి. అభ్యర్థులు ఎన్ని గంటలు నిద్రిస్తున్నారో వేక్‌ఫిట్ నిర్వాహకులు స్లీప్ ట్రాకర్ ద్వారా తెలుసుకుంటారు. సెలెక్టెడ్ ఇంటర్న్స్ అందరికీ కంపెనీ 1 లక్ష రూపాయలు అందిస్తుంది. ఇంటర్న్స్ అందరూ మిగతా అభ్యర్థులతో ఇతర స్లీప్ చాలెంజెస్‌లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా విజేత నిలిచిన వారికి రూ.10 లక్షలు ఇస్తారు.

ఉరుకుల పరుగుల జీవనంలో ఓ పక్క ఉద్యోగ విధులు, మరోపక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా మానవుడు నిద్రించే సమయం రోజురోజుకూ తగ్గుతున్నదని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొవిడ్ పాండమిక్ భయాలతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగుల్లో వర్క్ ప్రెషర్ పెరగడంతో చాలా మంది నిద్రకు అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తమ ప్రయారిటీ లిస్ట్‌లో నిద్రకు తక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఈ నేపథ్యంలో వేక్‌ఫిట్ కంపెనీ స్లీపింగ్ చాలెంజ్ నిర్వహించడం మంచిదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా నిద్ర అనేది అతిముఖ్యమైన విషయమని చెప్పేందుకే తాము ఈ చాలెంజ్ నిర్వహిస్తున్నట్లు వేక్‌ఫిట్ కంపెనీ డైరెక్టర్, కో ఫౌండర్ చైతన్య రామలింగె గౌడ చెప్పారు. నిద్రపోవడం కోలాహలంగా భావించే వారు ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇతర జాబ్‌ల మాదిరి నిద్రపోవడం కూడా ఓ సీరియస్ జాబ్ అని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story