అక్రమ రేషన్ దందాకు .. కేరాఫ్ కల్వకుర్తి 

by  |
అక్రమ రేషన్ దందాకు .. కేరాఫ్ కల్వకుర్తి 
X

దిశ, కల్వకుర్తి: రేషన్ బియ్యం తరలించడంలో కల్వకుర్తి కేరాఫ్ గా మారింది. పేద,మధ్య తరగతి ప్రజల కోసం అందిస్తున్న ఉచిత బియ్యం అంగడి సరుకులా మారింది. పేదలకు అందాల్సిన ప్రజా పంపిణీ బియ్యం దళారుల చేతిలో పడి రూట్ మారుతుంది. రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిన కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. రేషన్ దుకాణాల నుంచి లబ్ది దారుల ఇళ్లకు చేరకముందే దళారుల పాలవుతుంది.

ఆ బియ్యం కాస్త ఎక్కడికి చేరుతుందో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. బియ్యాన్ని దళారులు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డదారిలో సంపాదించటానికి అలవాటుపడ్డ కొందరు డీలర్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యానికి బదులు ఇప్పటి వరకు డబ్బులు ఇస్తూ వచ్చారు. ఇటీవల డబ్బుకు బదులు నిత్యావసరాలు అందిస్తున్నారు. దాన్ని అలుసుగా మార్చుకొని అక్రమార్కులు జిల్లాలకు, రాష్టాలకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

వ్యాపారం ఇలా..

ముఖ్యంగా కల్వకుర్తి డివిజన్ లోని 5 మండలాల నుంచి వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని తరలించడం పరిపాటిగా మారింది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కష్టాల్లో ఉచితంగా ఒక్కోరికి 15 కేజీల రేషన్ బియ్యం లబ్దిదారులకు అందజేసింది. అది కాస్త డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం నిలిపివేయడంతో, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉచితంగా డిసెంబర్ వరకు మనిషికి 5 కేజీల రేషన్ బియ్యం సరఫరా చేస్తుంది.

కల్వకుర్తి డివిజన్ పరిధిలోని చుట్టూ పక్కల మండలాలైన కల్వకుర్తి, ఉర్కొండ, వెల్డండ, చారకొండ, వంగూరు గ్రామ, మండల పరిధిలో దాదాపు పాతిక రైస్ మిల్లులు ఉన్నాయి. గ్రామం నుంచి మొదలెట్టి మండల, పట్టణ మిల్లులకు ఆటోలలో, వివిధ వాహనాలాలో గుట్టు చప్పుడు కాకుండా తెల్లవారుజామున 2 గం. నుంచి 5 గం. సమయాల్లో అక్రమార్కులు రైస్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు.

అంగడి సరుకాయే..

ఉచిత రేషన్ బియ్యాన్ని వినియోగదారులు కిలోకు 10 రూపాయల నుంచి 12 రూ. వరకు వివిధ షాపుల్లో విక్రయిస్తుండగా, స్మగ్లర్లు కిలోకు రూ. 15 నుంచి 17 రూ. చొప్పున దుకాణదారులు వద్ద కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి 24 రూ. నుంచి 25 రూ.లకు సీఎంఆర్ కింద విక్రయిస్తున్నారు. ఇలా రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని ప్రభుత్వానికి వారంలో మూడు నుంచి నాలుగు లారీల చొప్పున తరలిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ముకు గండి కొట్టి లక్షలు సంపాదిస్తున్నారు.

చర్యల్లేవ్..

రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పీడీ యాక్టు ఉన్నప్పటికీ స్మగ్లర్లు మాత్రం దందా కొనసాగిస్తూనే ఉన్నారు. పీడీ యాక్టు నమోదు చేస్తే జైలు నుంచి బయటపడే అవకాశం లేకపోయినప్పటికీ దందా మాత్రం ఆపడం లేదు. పేదలకు చెందవలసిన బియ్యం పక్కదారి పట్టిస్తూ బియ్యం స్మగ్లర్లు లక్షలు గడిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ఎన్ని సార్లు దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేసిన ఫలితం మాత్రం శూన్యం అవుతుంది. అక్రమార్కులు బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తూ లక్షలలో రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి కొంతమంది రేషన్ డీలర్లు సైతం సహకరిస్తున్నడంతో దందా ఎదేచ్చగా సాగుతుంది. ఈ మధ్య కాలంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. బియ్యాన్ని నూకలు గా మార్చి బీర్ కంపెనీలకు తరలిస్తున్నారు.

అక్రమ వ్యాపారమిలా..

రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తారు. తరలించిన వరి ధాన్యాన్ని మిల్లర్లు వర్కింగ్ చేసి బియ్యం రూపేణా తిరిగి జడ్చర్ల లోని ఎఫ్ సి ఐ కు ఎగుమతి చేయాలి. గతంలో నిబంధనలు పాటించకుండా తూతూ మంత్రపు తనిఖీలతో పాసింగ్ నిర్వహించేవారు. దాని వల్ల స్మగ్లర్లు లాభాపేక్ష ఉండేది. ప్రస్తుతం మిల్లర్లు ఎఫ్సి ఐ కు ఎగుమతి చేసిన రేషన్ బియ్యాన్ని సంబంధిత శాఖ అధికారులు బియ్యంలో రసాయనం కలిపి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

దీని ద్వారా రిసైక్లింగ్ బియ్యం మరల ఎఫ్ సి ఐ కి మిల్లర్లు ఎగుమతి చేస్తే రసాయన పరీక్షలో నిజాలు తెలిసే అవకాశముండటంతో వారి అక్రమ బియ్యం వ్యాపారం చతికిల పడటంతో పై అధికారులతో మిల్లర్లు చర్చలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పౌరసరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ దందాకు కళ్లెం వేయాలి.

చర్యలు తీసుకోవాలి

అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్ల, స్మగ్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైస్ మిల్లుల పై దాడులు నిర్వహించి,అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుకుంటున్నారు.

Next Story