బురద జీవితం

by  |
బురద జీవితం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంత కుంభవృష్టి కురిసినా ఎన్నడూ ముప్పు వాటిల్లలేదు. నిజాం నాటి డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంగా ఉందని అందరూ ప్రశంసించారు. కానీ మునుపెన్నడూ లేని విధంగా పాతబస్తీ కూడా ముంపునకు గురైంది. వేలాది కుటుంబాలు 4 రోజులుగా బురద, మురుగు నీటిలోనే మగ్గుతున్నాయి. దుర్వాసనతో బతుకులీడుస్తున్నారు. వందల ఏండ్లుగా ఎప్పుడూ చూడని విపత్తును పాతబస్తీవాసులు చూస్తున్నారు. ప్రకృతి ప్రకోపమేం కాదిది.. మానవ తప్పిదాలతోనే నేడు చారిత్రక హైదరాబాద్ ముంపు సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఒక్కో ఇంట్లో ఒక్కో వ్యథ వినిపిస్తోంది. ఏ బస్తీకి వెళ్లినా, ఏ కాలనీని సందర్శించినా బురదను ఎత్తిపోస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. కట్టుబట్టలే మిగిలిన కుటుంబాలు ఉన్నాయి. ఇంట్లోని వస్తువులన్నీ తడిసిపోయాయి. వాషింగ్ మిషన్లు, ఫ్యాన్లు పనికి రాకుండా పోయాయి.

ఆటోలు, ద్విచక్ర వాహనాలన్నీ బురదలోనే కూరుకుపోయాయి. ఏ ఇంటి పైన చూసినా బట్టలు, పరుపులు, చెద్దర్లు.. అన్నీ బురదతో నిండిపోయిన వస్త్రాలను పడేశారు. తడిసిన పత్రాలను, విలువైన డాక్యుమెంట్లను ఆరబెట్టుకుంటున్నారు. ఒకటీ రెండు ప్రాంతాల్లో కాదు.. అల్జీబెర్ కాలనీ, జీఎం చావునీ, పూల్ బాగ్, అరుంధతినగర్, శివాజీనగర్, ఉప్పుగూడ, సాయిబాబానగర్, కృష్ణారెడ్డినగర్, రాజన్నబాయి, జగ్జీవన్ రాం కాలనీ.. ఇలా పదుల సంఖ్యలో కాలనీలు, బస్తీల్లో వేలాది కుటుంబాలు కంటి మీద కునుకు లేకుండా గడిపేస్తున్నారు. సోమవారం మళ్లీ కురిసిన వర్షానికి ఈ కాలనీలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లల్లో నుంచి అప్పుడే నీళ్లు, బురదను ఎత్తి పోసుకున్నారు. మళ్లీ యథాతథంగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన అనుచరగణంతో పర్యటించారు. జనం సమస్యలను వీక్షించి వెళ్లిపోయారు. పరిష్కార మార్గాలను వెతకకుండానే తిరిగి వెళ్లిపోయారని ముంపు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇండ్లు ఖాళీ చేస్తున్న జనం

ముంపు సమస్యతో పాత నగరంలోని పలు ప్రాంతాల్లో ఇండ్లు ఖాళీ చేస్తున్నారు. వేలాది కుటుంబాలు ఇప్పటికే తాళాలు వేసి వారి బంధువుల ఇండ్లకు వెళ్లిపోయారు. గత్యంతరం లేక, అవకాశాలు లేక అదే కాలనీల్లో మగ్గుతున్న వారూ వేలల్లోనే ఉన్నారు. అయితే ప్రభుత్వం నిర్మించిన జగ్జీవన్ రాం కాలనీ కూడా ముంపునకు గురైంది. అక్కడా గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేశాయి. కింద ఉన్నోళ్లంతా ఖాళీ చేస్తున్నారు. పై అంతస్థుల్లో ఉన్నోళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీళ్లల్లో అత్యధికం దినసరి కూలీలే. పని చేస్తే తప్ప పూట గడవని మైనార్టీలే ఎక్కువ. వర్షాలకు ఓ వైపు ఉపాధి కరువైంది. మరోవైపు గూడు చెదిరింది. ఉపాధినిచ్చే ఆటోలు, కార్లు కూడా బురదతో నిండిపోయాయి. వాటిని బాగు చేయించుకునేందుకు కూడా రూ.వేలల్లోనే వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఆక్రమణలతోనే ముంపు

పాతబస్తీ ఎన్నడూ ముంపునకు గురి కాలేదు. కానీ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ దాష్టీకమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా బాలాపూర్, జల్‌పల్లి ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో అక్రమంగా లేఅవుట్లు వేశారు. కొంత భాగం విల్లాలు నిర్మించి దుబాయ్, అరబ్ దేశాల్లో స్థిరపడిన వారికి అమ్మేశారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు రెండు ప్రధాన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో చెరువులు, నాలాలను కబ్జా చేసి వెంచర్లు వేశారు. ఈ వరద ముప్పులోనూ ఆ సంస్థ పనులేవీ ఆపలేదు. నేటికీ ప్లాట్ల అమ్మకాలను సాగిస్తోంది. అయితే ఈ ప్లాట్ల ధర బయటి మార్కెట్ కంటే తక్కువకే వస్తుండడంతో జనం ఎగబడుతున్నారు. ఈ చర్యల కారణంగానే పల్లె చెరువు, బాలాపూర్, మీర్‌పేట, జల్‌పల్లి చెరువులకు ముప్పు వాటిల్లిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎందుకు తెగాయి : ఎల్.కోటయ్య, సీపీఎం మండల కార్యదర్శి, బండ్లగూడ

మేం ఐదు రోజులుగా అన్ని బస్తీల్లో పర్యటించాం. ఆ కుటుంబాల వ్యథ అంతా ఇంతా కాదు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సర్వం కోల్పోయారు. అన్ని వస్తువులు తడిచిపోయాయి. ప్రతి ఇంటి ముందు బురద పేరుకుంది. శుభ్రం చేసుకోవడానికి మానవ వనరులు సరిపోవు. వాళ్లకు ఉపాధినిచ్చే ఆటోలు, కార్లన్నీ బురదతో నిండిపోయింది. ఇన్ని రోజులుగా లేని వరద ముంపు ఇప్పుడెందుకు వచ్చింది? ఆ చెరువులు ఎందుకు తెగాయి? దీనికి కారణాలేమిటి? ఏ రియల్ ఎస్టేట్ సంస్థకు నాయకులు మద్దతు పలుకుతున్నారో వారి వల్ల జరిగిన విపత్తుకు మూల్యం ఎవరు చెల్లించాలి? భవిష్యత్తులోనూ బాలాపూర్, బండ్లగూడ, రాజేంద్రనగర్ మండలాల్లోని చెరువులు, కుంటలు తెగే ప్రమాదం పొంచి ఉంది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఆగడాలపై చర్యలు తీసుకోవాలి.


Next Story

Most Viewed