చినుకు పడితే చిత్తడే.. సిద్దిపేట ఆగమాగం

by  |
చినుకు పడితే చిత్తడే.. సిద్దిపేట ఆగమాగం
X

దిశ సిద్దిపేట: వర్షం పడిందంటే చాలు .. సిద్దిపేట పట్టణ ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. చిన్న వర్షం కురిసిన పట్టణంలోని పలు కాలనీలు జలమయమవుతున్నాయి. ఇక భారీ వర్షం కురిస్తే మాత్రం రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు మురుగు నీటితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన వారి నుండి ఎలాంటి స్పందన లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు వర్షం పడిన పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే తీరు .. వర్షం పడిన ప్రతిసారి అవే సమస్యలు పునరావృత్తమవుతున్నాయి. చిన్నపాటి వర్షాలకు సిద్దిపేటలోని రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి.

సిద్దిపేట‌కు గుండెకాయలాంటి మైత్రీవనంలోనే ఇలాంటి పరిస్థితి ఉంది ..ప్రగతి నగర్, భవానీనగర్ ,ప్రియదర్శిని నగర్‌లో కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా రోడ్ల పరిస్థితి తయారైంది. ఈ కాలనీలో ఉన్న మహిళా డిగ్రీ కాలేజ్‌కి వెళ్లడానికి విద్యార్థినీలు ఇబ్బందిపడుతున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఏ వార్డులు చూసిన యూజీడీ పనులతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఫలితంగా ఏ చిన్న చిరు జల్లు కురిసిన లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వెంటనే యూజీడీ నిర్మాణ పనులు పూర్తి చేసి, రోడ్లను బాగు చేసి, వర్షపు నీరు పోయేందుకు ప్రత్యేక కాల్వలు నిర్మించి పట్టణ ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కోరుతున్నారు. వర్షం పడిన ప్రతీసారి ఇవే సమస్యలు పునరావృత్తమవుతున్నాయి. వర్షం పడ్డప్పుడు తాత్కాలికంగా సమస్యను పరిష్కరిస్తున్నారే తప్పా వాటికి శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారు. మరీ ఈ సారైన మున్సిపల్ అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.

Next Story