గోదారికి వరదలు : లంకలకు తప్పని తిప్పలు 

by  |
గోదారికి వరదలు : లంకలకు తప్పని తిప్పలు 
X

దిశ, వెబ్ డెస్క్: గోదారమ్మకు వరద పోటెత్తింది. ఎడతెరిపిలేని వర్షాల ధాటికి సుమారు 60 గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. జనజీవనం స్తంభించి జలజీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. కుండపోత వర్షాలకు పంటలు నీటమునిగాయి. రెక్కాడితే డొక్కాడని బడుగుజీవులు లబోదిబోమంటున్నారు.

వారి గోడు వినడానికే కష్టంగా ఉంటే… దాదాపు ప్రతి ఏటా ఇదే దుర్భర స్థితిని ఎదుర్కొంటున్న వారికి ఇంకెంత కష్టంగా ఉంటుందో…! వరదలు ముంచెత్తినా, పంట పొలాలు నీట మునిగినా, ఖర్చు చేసిన డబ్బు మాయదారి వానపాలైనా… గుండెల్లో బాధంతా కళ్ళవెంట ఉప్పోగుతుంటే… కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ సాగుకి రెడీ అయిపోతారు. ఏం గుండె నీది రైతన్నా? కష్టాలకు, వర్షాలకు ఎదురీదుతూ బతుకు పోరాటం చేస్తున్న కోనసీమ రైతులను ఈసారి వరద ఎలా ‘ఉరిమి’ చూసిందో తెలుసుకుందాం.

లంక గ్రామాల ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయం, పాడి పరిశ్రమ. రెండుమూడు రోజుల వర్షాలు పెద్దగా ఇబ్బంది పెట్టవు కానీ… వారం పది రోజులు వరుణదేవుడు ఆతిధ్యం తీసుకుంటే మాత్రం లంక ప్రజలకు తిప్పలే. ఒక్క కొబ్బరి తోటలకు తప్ప మిగిలిన పంటలన్నిటికీ నష్టమే. ఇక్కడి రైతులు కౌలుకు భూములు తీసుకుని వరి, అరటి, కూరగాయ తోటలు, బొప్పాయి, పూలతోటలు, ఇలా అనేక పంటలు పండిస్తుంటారు. వీటితోపాటు పాడిపశువులు ఎక్కువుగా పెంచుతుంటారు. పాడితోనే లంకవాసులలో చాలా కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి.

ఈసారి పది రోజులవరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లంకగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంటలు మునిగిపోయి కుళ్లిపోయాయి. పశువులకు దాణా లేక ఏటిగట్లపై దిగాలుగా పడివున్నాయి. గడ్డిలేకపోవడంతో పాలిచ్చే గేదెలు పాలివ్వడం తగ్గించాయి. నిత్యావసరాలు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఊళ్లలో నాలుగైదు అడుగులకు పైగానే నీళ్లు నిలిచిపోయాయి. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా ఆరు అడుగులు స్థలం దొరక్క లంకల్లోని వరద బాధితులు అవస్థలు పడుతున్నారు.

లంక గ్రామాల ప్రజలను ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ విధంగానూ ఆదుకోలేదని బాధిత రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ కూడా లేని ముంపు ఇళ్లల్లో విష సర్పాల భయంతో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఉన్న పాడిగేదెలను ఏటిగట్టుపై కట్టేసి వాటికి కాపలాగా రైతులు గట్లపై పడుకుంటున్న దృశ్యాలు మనసుల్ని కరిగిస్తున్నాయి.

వీటికి తోడు ఈ ఏడు అదనంగా వచ్చిపడ్డ కరోనా మరింత ఆందోళన పెడుతోంది. కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లలేని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ వరద ముంపు కారణంగా నష్టపోయిన కౌలు రైతులు ప్రభుత్వాలు ఇచ్చే నష్ట పరిహారాలు పట్టాదారులకే కాకుండా వారికి కూడా ఇవ్వాలని వేడుకుంటున్నారు.

వరదలు ఆగినా కొన్నాళ్లపాటు తిరిగి పంటలు వేయడానికి వుండదని, పొలాల్లో వేసిన మేటలు తొలగించుకోవడానికి కూడా వ్యయప్రయాసలు పడాల్సివస్తుందని రైతులు వాపోతున్నారు. పదివేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ఉద్యానవన, వ్యవసాయశాఖ అంచనా. ఎలాగైనా కోనసీమ రైతులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు స్థానిక ప్రజలు.



Next Story

Most Viewed