డంపింగ్ యార్డ్ కు ఐదెకరాలు

by  |
డంపింగ్ యార్డ్ కు ఐదెకరాలు
X

దిశ, వరంగల్: డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం సీఆర్ నగర్ లోని ఐదెకరాల భూమిని మున్సిపాలిటీకి అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం సింగరేణి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ రెవెన్యూ, సింగరేణి, మున్సిపాలిటీ అధికారులతో కలిసి సీఆర్ నగర్ బాంబుల గడ్డ వద్ద గల స్మశాన వాటికను, దాని పక్కనే 247 సర్వేనెంబర్ లోని సింగరేణి సంస్థకు చెందిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలో ప్రత్యేకంగా చెత్త డంపింగ్ యార్డ్ లేకపోవడం వలన స్మశాన వాటిక స్థలంలో మునిసిపాలిటీ వారు చెత్త వేస్తున్నారన్నారు. దీంతో స్మశాన వాటిక పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని, ఈ నేపథ్యంలో స్మశాన వాటిక పక్కనే ఉన్న సింగరేణి స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. సింగరేణి సంస్థకు చెందిన ఐదెకరాల భూమిని డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రెండు రోజుల్లోగా మున్సిపాలిటీకి అందజేయాలని జీఎం నిరీక్షన్ రాజ్ ను ఆదేశించామన్నారు. చెత్త డంపింగ్ యార్డ్ కోసం సింగరేణి సంస్థ ఇచ్చే 5 ఎకరాల స్థలంలో వివిధ వరసలుగా చెత్త డంపింగ్ చేయడానికి ఏర్పాటు చేయాలన్నారు. డంపింగ్ యార్డ్ చుట్టూ పచ్చని మొక్కలు నాటి పరిశుభ్రంగా ఉంచాలని, డంపింగ్ యార్డ్ కు ప్రత్యేక సరిహద్దులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో వైవి గణేష్, తహసిల్దార్ అశోక్ కుమార్, ఆర్ఐ దేవేందర్, సింగరేణి సంస్థ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed