ద్రవ్యోల్బణం, వ్యాక్సిన్ ఆమోదం కీలకం!

by  |
ద్రవ్యోల్బణం, వ్యాక్సిన్ ఆమోదం కీలకం!
X

దిశ, వెబ్‌డెస్క్: గత వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రికార్డులతో హోరెత్తించాయి. వరుసగా జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన సూచీలు నాలుగు సెషన్‌లు రికార్డులతోనూ, ఒక్క సెషన్ మాత్రమే స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా కొవిడ్-19 వ్యాక్సిన్‌ల ఆమోదం, భారీగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం, వ్యాపార వాతావరణం మెరుగుపడటం వంటి కీలక అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దూకుడుగా ర్యాలీ చేశాయి. దీంతో గత వారంలో బెంచ్‌మార్క్ సూచీలు 4 శాతానికి పైగా పెరిగాయి. ఈ వారం కూడా ఇవే అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా మెరుగైన పారిశ్రామికోత్పత్తి డేటా కూడా మార్కెట్లకు దోహదపడే అవకాశాలున్నాయని, ద్రవ్యోల్బణం, ఐపీఓ అంశాలు కీలకం కానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఈ వారంలో దేశీయ మార్కెట్లు ద్రవ్యోల్బణం, దిగుమతి-ఎగుమతుల గణాంకాలు కోసం వేచి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు బ్రెక్సిట్ ఒప్పందం చర్చల పరిణామాలు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై అప్‌డేట్ కోసం వేచి చూస్తున్న తరుణంలో ఈ అంశాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించవచ్చు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.

ఈ వారం మార్కెట్లను నిర్దేశించే ముఖ్యమైన అంశాలు :

ద్రవ్యోల్బణ డేటా
నవంబర్‌కు సంబంధించి హోల్‌సేల్, రిటైల్ ద్రవ్యోల్బణ డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. గత కొన్నాళ్లుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఈసారి మరింత కీలకంగా ఉండనుంది. ఎందుకంటే, ఆర్‌బీఐ ఎంతమేరకు విధాన సడలింపులను కల్పించగలదో నిర్ణయించనుంది. ‘మునుపటి నెలతో పోలిస్తే నంవంబర్ ద్రవ్యోల్బణం మెరుగ్గా ఉంటుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇది మరింత మెరుగ్గా ఉంటుందని’ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.

ఎఫ్ఐఐ ప్రవాహం
దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్‌ పొలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)పెట్టుబడుల ప్రవాహం నవంబర్‌లో 60 వేల కోట్లకు పెరిగింది. డిసెంబర్‌లో ఇప్పటివరకు రూ. 33,383 కొట్ల విలువైన షేర్లను విదేశీ పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు. ఈ ధోరణిపై మార్కెట్ వర్గాలు నిఘా ఉంచాయి. మదుపర్లు ఎఫ్ఐఐ పెట్టుబడుల గురించి నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఐపీఓ లిస్టింగ్
అంతర్జాతీయ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చెయిన్‌గా గుర్తింపు ఉన్న బర్గర్ కింగ్ భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఫాస్ట్‌ఫుడ్ బిజినెస్‌లో మెరుగ్గా రాణిస్తున్న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు సిద్ధమైంది. కాగా, ఈ వారం ఐపీఓల్లో ఈ కంపెనీ షేర్ల ప్రభావం కొంతమేరకు మార్కెట్ లపై ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

అంతే కాకుండా, బర్గర్ కింగ్ లాంటి కంపెనీలకు ముడి పదార్థాలను అందించే మరో కంపెనీ మిసెస్ బెక్టార్స్ ఫుడ్ స్పెషాలిటీస్ కూడా ఐపీఓకు రానుంది. దేశీయంగా ప్రీమియం బిస్కెట్ తయరీ, మల్టీ నేషనల్ చెయిన్-రెస్టారెంట్లకు ఫుడ్ సప్లై చేసే కంపెనీగా గుర్తింపు ఉన్న ఈ కంపెనీ రూ. 540 కోట్లను ఐపీఓ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా ఉంది. ఒక్కో షేర్‌కు రూ. 286-288 గా కంపెనీ నిర్ణయించింది.

వ్యాక్సిన్ ఆమోదంపై పురోగతి
కరోనా వ్యాక్సిన్ ఆమోదానికి సంబంధించిన పరిణామాలపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. ఫైజర్ మరిన్ని దేశాల్లో ప్రభుత్వ ఆమోదానికి సిద్ధమవుతోంది. భారత్‌లోనూ ఆమోదం కోసం వేచి ఉంది. దీంతోపాటు ఇతర వ్యాక్సిన్‌ల ఆమోదాలు కూడా ఈ వారం మార్కెట్లలో కీలకంగా ఉండనున్నాయి.

యూఎస్ ఆర్థిక ఉద్దీపన
అమెరికా ప్రభుత్వం త్వరలో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించనుంది.



Next Story

Most Viewed