ఇందూరు ‘కారు’లో సెగలు, పొగలు

by  |
ఇందూరు ‘కారు’లో సెగలు, పొగలు
X

రాష్ట్రవ్యాప్తంగా ఏ ఎన్నిక వచ్చినా గులాబీ జెండాను రెపరెపలాడిస్తూ సంబరాలు చేసుకుంటున్నా అధికారపార్టీ నేతలకు నిజామాబాద్ జిల్లాలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఏ ఎన్నికలు వస్తాయోమోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడిపోతున్నారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఇందూరు జిల్లాలో ఐదుకు ఐదు స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్‌తో చేసుకున్న సంబరాలే చివరివి అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలతో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే వీటన్నింటికి ఆజ్యం పోసింది మాత్రం పార్లమెంట్ ఎలక్షన్స్‌లో నిజామాబాద్‌లో కేసీఆర్ తనయ కవిత ఓటమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

నిజామాబాద్ పార్లమెంట్‌ పరిధిలోని అర్బన్‌లో 400 ఓట్ల మెజార్టీ మినహా అన్ని చోట్ల బీజేపీనే లీడ్ చేసింది. దీంతో కవిత ఓడిపోయి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విక్టరీ కొట్టారు. అయితే ఎంపీగా రెండోసారి కవిత గెలిస్తే తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్న కారణంతోనే ఆమె ఓటమికి ఎమ్మెల్యేలు కారణమయ్యారన్న ఆరోపణలు వినిపించాయి. జిల్లాలో ఒక్కరిద్దరు వ్యవహరించిన తీరే కవిత ఓటమికి కారణమని ఇంటెలిజెన్స్ ద్వారా హైకమాండ్‌కు ఓ ప్రజాప్రతినిధి సమాచారం అందించారన్న మాటలు వినిపించాయి. అప్పటి నుంచే ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్థన్‌ తనయుడు జగన్‌ అవుతారని అనుకున్నా చివరకు జడ్పీ చైర్మన్‌గా విఠల్‌రావు పేరును ప్రతిపాదించేలా హైకమాండ్ ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యవహరించడంతో అప్పటి నుంచి రూరల్ ఎమ్మెల్యేకు పొసగట్లేదన్న కామెంట్లు మరోసారి గట్టిగా వినిపించాయి.

మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి పొసగట్లేదని ప్రచారం జరిగిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొనలేదు. ఈ క్రమంలోనే ఆర్మూర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెల్చుకున్నా అక్కడ ప్రమాణస్వీకారానికి మంత్రిని ఆహ్వానించలేదని, కనీసం అడ్వర్టైజ్‌మెంట్‌లలో మంత్రి ఫోటో కూడా ఉండకపోవడంతో ఆయన అనుచరులు ఎమ్మెల్యే తీరుపై గుస్సాగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల్లో జరిగిన కొన్ని పరిణామాలు ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జీవన్‌రెడ్డి మధ్య విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్లాయని అనుకుంటున్నారు.

జీవన్‌రెడ్డి నియోజకవర్గంలోని మాక్లూర్ సొసైటీ చైర్మన్ పదవికి తన తండ్రి కృష్ణమూర్తిని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా బరిలోకి దింపారు. డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులను దక్కించుకోవాలని ప్లాన్ చేశారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. సొసైటీలో 13 మంది టీఆర్ఎస్ సానుభూతిపరులు గెలిచినా కృష్ణమూర్తి కాకుండా గోపు లక్ష్మి చైర్‌పర్సన్ కావడంతో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా జీర్ణించుకోలేకపోయారు. దీనికి జీవన్‌రెడ్డినే కారణం అని భావించిన ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తన తండ్రి చేత డైరెక్టర్ పదవికి రిజైన్ చేయించారన్న ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలోనే డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ పదవులకు ఈనెల 29న ఎన్నికలు జరుగుతుండటంతో విభేదాలు ఏస్థాయికి దారి తీస్తాయోనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. స్పీకర్ పోచారం.. తన తనయుడు భాస్కర్‌రెడ్డి కోసం, మంత్రి ప్రశాంత్‌రెడ్డి తన బంధువు రమేశ్‌రెడ్డి కోసం, ఎమ్మెల్యే షకిల్ తన అనుచరుడు గిర్దవార్ గంగారెడ్డి కోసం, జీవన్‌రెడ్డి మారం గంగారెడ్డికి పదవి ఇవ్వాలని పట్టుపడుతుండటంతో పరిస్థితులు ఉప్పు నిప్పులా మారాయి.

Read also..

‘సీటెట్’దరఖాస్తు గడువు పొడగింపు..

Next Story

Most Viewed