ఆగని పోడు రగడ.. అటవీ అధికారులకు రైతులకు మధ్య ఘర్షణ

by  |
ఆగని పోడు రగడ.. అటవీ అధికారులకు రైతులకు మధ్య ఘర్షణ
X

దిశ, కొత్తగూడ : ఏజెన్సీ మండలాల్లో పోడు భూముల వ్యవహారం రావణ కాష్టంలా మండుతూనే ఉంది. అటవీ అధికారులకు పోడు సాగుదారులకు మధ్య ఘర్షణ వాతావరణం తరచూ కొనసాగుతూనే ఉంది. కొత్తగూడ మండలంలోని నీలంపల్లి గ్రామంలో గత 50 సంవత్సరాలుగా పోడు భూముల్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పెద్ద సంఖ్యలో అటవీ అధికారులు, పోలీసుల సహకారంతో పోడు భూముల్లో ట్రెంచ్ ఏర్పాటు చేయడానికి వెళ్లారు. ఇది గమనించిన నీలం పల్లి గ్రామస్తులు అటవీ అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో గ్రామంలో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ భూముల్ని లాక్కోవద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా అటవీ అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ ట్రెంచ్ పనులు చేపట్టారు.

పనులు ఎంతసేపటికీ నిలిపివేయక పోవడంతో భూమి సాగు చేస్తున్న వారి నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అడ్డుకోబోయిన మహిళా రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో బాధిత పోడు భూమి సాగుదారులు రహదారిని నిర్భందించారు. తమ భూములపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు. పోడు భూముల్లో ట్రెంచ్ ఏర్పాట్లు చేయడం ప్రస్తుతం నిలిపివేయాలని, సాగు దారులైన రైతుల్ని ఇబ్బందుల పాలు చేయొద్దని ఎంపీ మాలోతు కవిత ఆటవీఅధికారులకు గత రెండ్రోజుల కిందట సూచన చేశారు. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాలేదని గ్రామస్తులు వాపోతున్నారు.

Next Story

Most Viewed