ముంచుకొస్తున్న మరో గండం.. అన్నదాతలు జర జాగ్రత్త

by  |
ముంచుకొస్తున్న మరో గండం.. అన్నదాతలు జర జాగ్రత్త
X

దిశ, బూర్గంపాడు : వరుసగా అల్పపీడనం, తుఫాన్లతో అన్నదాతలు హడలిపోతున్నారు. తాజాగా మరో గండం ముసురు రూపంలో ముంచుకొస్తున్నది. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీపావళి ముందు ముసురు పట్టడం కొత్తేమి కాకపోయినా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కళ్లాల్లో ఆరబెట్టిన వడ్లు, బస్తాల్లో ఉన్న ధాన్యం మొత్తం తడిచి ముద్దయ్యింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా వర్షం నీటికి వడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పుడిప్పుడే వరుణుడు గెరువిస్తున్నాడు. కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. త్వరగా ధాన్యాన్ని అమ్మేయాలని అనుకున్న రైతులకు ముంచుకొస్తున్న ముసురుతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

గత రెండు రోజుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో అక్కడక్కడా చిన్నపాటి చినుకులు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కోత దశకు చేరుకున్న ఖరీఫ్‌ పంటలు ఈ అకాల వర్షాలకు దెబ్బతింటున్నాయి. మరోసారి వర్షం కురిస్తే కోత దశలో ఉన్న ధాన్యపు రాశులు అన్ని రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం చేకూరుతుంది. బూర్గంపాడు మండల వ్యాప్తంగా దాదాపు 8500 ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ సాగు చేశారు. ప్రస్తుతం మండలంలోని మోరంపల్లి, బంజార, లక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో కేవలం ఐదారు వందల ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తయ్యాయి. ఇంకా 90 శాతం పంట చేలులోనే ఉంది. ఇప్పుడు గనుక వర్షాలు కురిస్తే అన్నదాతలు మరోసారి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.



Next Story