‘సన్న’ రైతు గోస

by  |
‘సన్న’ రైతు గోస
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సన్న వడ్ల కొనుగోలుకు సర్కారు చేతులెత్తేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటిదాకా కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం చూస్తే రైతులు నిలువునా మునిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. వానాకాలం సీజన్​లో పండించిన వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. కొనుగోళ్లకు ప్రైవేటు వ్యాపారులు సైతం విముఖత చూపకపోవడంతో న్యాయం కోసం రైతన్నలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.

రైతుల్లో మొదలైన కలవరం..!

సన్నరకం వడ్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో రైతుల్లో కలవరం మొదలైంది. త్వరలోనే మద్దతు ధర ప్రకటించి అన్నదాతలను ఆదుకుంటామని ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో దొడ్డు రకం వడ్లను ఐకేపీ, పీఏసీఎస్​ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే సన్నరకం వడ్లకు మరింత ధర వస్తుందన్న ఆశ రైతుల్లో ఉంది. దొడ్డు వడ్లను బయట మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కన్నా తక్కువకు కొంటున్నారు. దీంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ల లోనే అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే సన్నరకం వడ్లకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదు. ప్రైవేటు వ్యాపారులు దొడ్డు రకం వడ్ల కన్నా తక్కువ ధరకు సన్న వడ్లను అడుగుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఆందోళనలు తీవ్రతరం..

ఈ క్రమంలో న్యాయం కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం కనకా పూర్ గ్రామం వద్ద ఉన్న నిర్మల్- లక్షెట్టిపేట జాతీయ రహదారిపై భారీ ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సన్న రకం వడ్లకు మద్దతు ధర ప్రకటించి వెంటనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశా రు. వందలాది మంది రైతులు ఆయా గ్రామాల నుంచి తరలి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఒక దశలో పోలీసులు వచ్చి సముదాయంచినా రైతులు వినలేదు. సన్న వడ్లు కొనుగోలు విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే గాని ఆందో ళన విరమించమని హెచ్చరించారు. ఈ పరిణామం అ ధికార వర్గాలను ఆందోళనకు గురి చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాకా ఆగాలని అధికారులు, పోలీసులు రైతులను కోరారు. తాజాగా ఆదివారం నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు. మరో వైపు మంచిర్యాల జిల్లా కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో రైతులు ఆందోళనకు దిగారు.

వాతావరణ మార్పులతో ..

సన్నరకం వడ్లు కొనుగోలు విషయంలో జరుగుతున్న తాత్సారం అన్నదాతలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం.. మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఇందుకు కారణమవుతోంది. నివర్ తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు పడితే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు అధికారుల నుంచి సరైన సమాధానం లేదు.


Next Story

Most Viewed