అయ్యా కేసీఆర్ సారూ.. మా భూమిని జెడ్పీటీసీ క‌బ్జా చేస్తున్నడు (వీడియో)

600
Farmer video virus

దిశ ప్రతినిధి, వరంగ‌ల్: ప‌ట్టదారు పాసు పుస్తకం ఉన్న త‌మ భూమిని మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు జెడ్పీటీసీ మేక‌పోతుల శ్రీనివాస‌రెడ్డి క‌బ్జా చేస్తున్నాడని న‌మ్ముల భిక్షం అనే యాద‌వ రైతు ఆరోపించారు. త‌మ పూర్వీకుల నుంచి వ‌స్తున్న భూమిని జెడ్పీటీసీ క‌బ్జా చేసేందుకు కొంత‌మంది గ్రామ‌స్థుల‌ను త‌మ‌పైకి ఎగ‌దోస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని ప్రశ్నించినందుకు మూడ్రోజుల క్రితం త‌న‌పై దాడి కూడా జరిగిందని వెల్లడించారు. 17.33 ఎక‌రాల‌కు సంబంధించిన ప‌ట్టాదారు పాస్ పుస్తకాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని, అయినా జెడ్పీటీసీ క‌బ్జా చేసేందుకు ప్రయ‌త్నం చేస్తున్నట్లుగా తెలిపారు. ‘‘అయ్యా కేసీఆర్‌.. ఇది తెలంగాణ రాష్ట్రమా.. బీహార్ రాష్ట్రమా.. ఇదేనా బంగారు తెలంగాణా.. ప‌ట్టప‌గ‌లు జెడ్పీటీసీ య‌థేచ్చగా భూములు క‌బ్జా చేస్తున్నా.. యంత్రాంగం ప‌ట్టించుకోదా..? ఇదేనా మాకు ద‌స‌రా కానుక’’ అంటూ న‌మ్ముల భిక్షం కుమారులు ప్రశ్నించారు.

క‌బ్జాకు పాల్పడుతున్న జెడ్పీటీసీ మేక‌పోతుల శ్రీనివాస‌రెడ్డిపై వెంట‌నే చ‌ర్యలు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు న‌మ్ముల భిక్షం కొడుకు స‌త్యనారాయ‌ణ సోష‌ల్ మీడియాలో పెట్టిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉండ‌గా మేక‌పోతుల శ్రీనివాస‌రెడ్డిపై గ‌తంలోనూ క‌బ్జా ఆరోప‌ణ‌లుండ‌టం గ‌మ‌నార్హం. ఇదే మండ‌లంలోని ఆలేరు గ్రామం మీన్‌రోడ్‌లో కొంతమంది భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ అండ‌దండ‌ల‌తో ఎప్పుడూ వివాదాస్పందంగా వ్యవ‌హ‌రిస్తుంటాడ‌ని పార్టీ నాయ‌కులే పేర్కొంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..