అధికారుల నిర్లక్ష్యం.. ప్రాణాలు తీసుకున్న రైతు

by  |
అధికారుల నిర్లక్ష్యం.. ప్రాణాలు తీసుకున్న రైతు
X

దిశ, జడ్చర్ల : నెలలు గడుస్తున్నా డిజిటల్ పాసు పుస్తకాలు రాలేదు. అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్‌లో గురువారం రాత్రి వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఉదండాపూర్ శివారులో మల్లన్న (48)కు కొన్నేళ్ల కిందట ప్రభుత్వం ఇచ్చిన రెండున్నర ఎకరాలతో పాటు మరో ఎకరం పది గుంటల భూమి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పాసుపుస్తకాల విధానంలో మల్లన్నకు కొత్త పాస్ పుస్తకాలు రాలేదు. దీంతో రైతుబంధు పీఎం కిసాన్ సహాయ నిధి, రైతు బీమా వర్తించడం లేదు.

ఈ క్రమంలో పలుమార్లు జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయాడు. ప్రభుత్వం ఆ రైతుకు ఇచ్చిన భూమి ఇతరుల పేరున మార్పిడి కావడంతో ఆందోళనకు గురయ్యాడు. సర్వే కోసం దరఖాస్తు చేసిన అనంతరం నిన్న తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి సర్వేయర్ కోసం ఆరా తీసి వచ్చాడు. పనిలో జాప్యం జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మల్లన్న సాయంత్రం వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గర వెళ్లి చూడగా చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ పెద్ద బలవంతంగా ప్రాణాలు తీసుకోవడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మల్లన్న మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Next Story

Most Viewed