అల్లం సాగు చేస్తే.. రైతు కోటిశ్వరుడే !

by  |
అల్లం సాగు చేస్తే.. రైతు కోటిశ్వరుడే !
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లం.. పేదోడి నుంచి కోటిశ్వరుడి వరకు ప్రతిరోజు కూరల్లో వాడే సుగంధ ద్రవ్యం. బహిరంగ మార్కెట్లో ఎప్పుడూ మద్ధతు ధర పడిపోతుందన్న ఇబ్బందే ఉండదు. వంటకాల్లోనే కాకుండా అల్లం ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. పరిగడుపున అల్లం ముక్కపై తేనే పూసుకొని నమిలి మింగితే వికారంతో ఇతర అనారోగ్య సమస్య దూరమవుతాయని పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికీ మెజార్టీ ప్రజలు ఈ విధానాన్ని అనుసరిస్తుంటారు. అంతేగాక అల్లం మురబ్బా, పలు రకాల పచ్చళ్లను అల్లంతో తయారు చేస్తారు. అయితే ఈ అల్లం పంటను పండించడానికి రైతుకు ఎంత ఖర్చు అవుతుంది ? ఏ సమయంలో అల్లం దుంపలను నాటాలి ! ఎలాంటి నేలల్లో అయితే మంచి దిగుబడి లభిస్తుంది. మనదగ్గర మార్కెట్లో అల్లం పంటకు గిరాకీ ఉంటుందా ? అన్న విషయాలను తెలుసుకుందాం…

తొలిసారి అల్లం సాగుచేస్తే..

అల్లం పంటను సాగుచేయడం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి.. ముందుగా రైతులు కొద్ది విస్తీర్ణంలో మాత్రమే సాగు చేసుకోవాలి. అనుభవం వచ్చాక పంట వేస్తే లాభం వస్తుందనే నమ్మకం కలిగినప్పుడు సాగు చేసుకుంటేనే మంచిది. అప్పుడు సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చు. అల్లం పంటకు ముఖ్యంగా సమృద్ధిగా నీళ్ల సౌకర్యం ఉండటం చాలా ముఖ్యం.

నేలలు.. వాతావరణం

ఎర్రనేలలు, గరపనేలలు, చల్కా భూములు అల్లం సాగుకు అత్యంత అనువైనవి. బంక మట్టి నేలలు, నీరు నిలిచే నేలలు పంట సాగుకు అస్సలు పనికిరావు. తేమతో కూడిన వాతావరణం అనువుగా ఉంటుంది. నీడ ఉన్న ప్రదేశాల్లో కూడా అల్లం దిగుబడి పెరుగుతోంది. నీటి వసతి బాగా ఉండాలి. వర్షపాతం 700 నుంచి 1000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు.

ఎప్పుడు ప్రారంభించాలంటే..

అల్లం పంటను ఏప్రిల్ 15నుంచి మే 15వరకు విత్తుకోవచ్చు. తెలంగాణలో ముఖ్యంగా సిద్దిపేట రకం సాగుకు అనుకూలంగా ఉంటుంది. మారన్, రియోడిజనీరో, బైరి, తుని, సుప్రభ, సురుచి రకాలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. అయితే దుంపలను విత్తడానికి కొనుగోలు చేసే సమయంలో తెగుళ్లు సోకని వాటిని తీసుకుంటే వీలైనంత వరకు మంచిది.

దుంపలను 20నుంచి 25గ్రాముల బరువు ఉండేట్లు ముక్కలుగా చేయాలి. ఎకరాకు 500 నుంచి 800 కిలోల విత్తనం అవసరమవుతోంది. విత్తన దుంపలను 10రోజుల ముందు నుంచి 24గంటలు నానబెట్టడం వల్ల మొలక శాతం పెరుగుతుంది. అల్లంను ఎత్తు మడులపై విత్తాలి. ఆ తర్వాత 1.8X,1.2 మీటర్ల సమతుల మడులను తయారు చేసి.. . ఒకదాని పక్కన ఒకటి 30 సెం.మీటర్లు, 45 సెం.మీ లోతుండేలా కాలువలను ఏర్పాటు చేయాలి. వరుసలు మొక్కల మధ్య 45X 15 సెం.మీ ఎడం ఉండేలా చూడాలి. మన సాగు చేస్తున్న నీరు, వర్షపడ్డప్పటి నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ఎండకాలంలో నాలుగు రోజులకో తడి, వానకాలం చివరలో 7రోజులకోసారి తడి పారించాలి.

అల్లం నాటిన 40రోజులకు 26కిలోల యూరియా, 20కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 80రోజులకు 54కిలోల యూరియా, 42కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాస్, 120 రోజులకు 26కిలోల యూరియా, 20కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను వేస్తే పంట బాగుంటుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎరువుల వేసిన ప్రతిసారి మట్టిని ఎగదోయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే .. దుంపల మొదళ్లలో వేరును కత్తిరించే వేరుపురుగు నివారణకు.. ఎకరాకు 7కిలోల కార్బప్యూరాన్‌ గుళికలు వేస్తే పంటను మంచిగా కాపాడుకోవచ్చు.

తవ్వకం..

సాధారణంగా అల్లం కాలపరిమితి 9-10నెలలు. ఏప్రిల్, మే నెలల్లో నాటుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో త్రవ్వకానికి వస్తాయి. ఆకులు పసుపు పచ్చగా మారి ఎండిపోవడం, ఆకుల మధ్య కాండం ఎండిపోవడాన్ని బట్టి దుంపలు పక్వానికి వచ్చినట్లుగా గుర్తించాలి. ఫిబ్రవరి, మార్చి నెలలో నీడ ఏర్పాటు చేస్తే అదనంగా 20క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

ఎకరాకు ఖర్చు.. ఆదాయం !

అల్లం పంట వేసినప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎరువులు సకాలంలో వాడితే ఎకరానికి కనీసం 100 క్వింటాళ్ల అల్లం దిగుబడి వస్తుంది. కిలో అల్లం రూ.100 అనుకున్నా క్వింటాల్‌కు రూ.10వేలు. వంద క్వింటాళ్లకు లెక్క వేసుకుంటే రూ.10లక్షలు చేతికొస్తాయి. దీంట్లో దుక్కి దున్నినప్పటి నుంచి పంట కోతికి వచ్చి మార్కెట్‌కు తరలించే వరకు ఖర్చులు చూసుకుంటే కనీసం రూ.3లక్షల వరకు అవుతాయి. అంటే ఎకరా అల్లం పంట వేస్తే రూ.6.50లక్షల నుంచి 7లక్షలు మిగలుతాయి. మనకు పంట చేతికి వచ్చిన సమయానికి మార్కెట్లో రూ.50కే కిలో అల్లం ఉంటే కనీసం 3.50లక్షల నుంచి 4లక్షల ఆదాయం చేతికి వస్తుంది.


Next Story

Most Viewed