'రచయితలు పాలకవర్గానికి భజన చేస్తున్నారు'

by  |
రచయితలు పాలకవర్గానికి భజన చేస్తున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత సమాజంలో కులమతాలు ఏర్పడినట్లుగానే సామాజిక బాధ్యత ఉండాల్సిన రచయితల్లోనూ వర్గీకరణ ఏర్పడిందని, కొద్దిమంది పాలకవర్గాలకు భజన చేస్తున్నారని ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చాలా ప్రాంతాల్లో పదవుల కోసం రచయితలు ఆరాట పడుతున్నారని గుర్తుచేశారు. ‘అగ్నిశ్వాస‘ పుస్తకానికి 2020 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించగా.. ఢిల్లీలో శనివారం దీన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రచయితలు పాలకుల తప్పిదాలను, పొరపాట్లను, లోపాలను ఎత్తి చూపితే పాలకవర్గాలు సహించలేకపోతున్నాయన్నారు. చివరకు కొద్దిమంది రచయితలు జైలుపాలు కాక తప్పడంలేదన్నారు.

‘అగ్నిశ్వాస‘ పుస్తకానికి అవార్డు రావడంపై మాట్లాడుతూ.. ఏనాటికైనా తన శ్వాస అగ్నిశ్వాస మాత్రమేనని, ప్రజా పోరాటాలే తన ధ్యాస, లక్ష్యం అని అన్నారు. రచయితలు, కవులు, కథా రచనలు చేసేవారు వ్యక్తులుగా ఉండొచ్చుగానీ ఒక సమాజంలోని అంశాన్ని స్పృశిస్తారని, మళ్ళీ సమాజానికే చేరుస్తారని, ఆ విధంగా వారు సమిష్టి అవుతారని అన్నారు. సమాజంలో చాలా వైరుధ్యాలు ఉంటాయని, అందులో కులం, మతం లాంటి వైరుధ్యాలు కూడా ఉన్నాయని, ఈ వ్యవస్థలో సామాజిక బాధ్యత కలిగిన రచయిత వ్యక్తిగా కంటే సమిష్టిగా చాలా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, సమాజానికి దిశానిర్దేశం చేయాల్సి ఉంటుందన్నారు.

ప్రస్తుత సమాజంలో రచయితలు, కవులు, కళాకారులు అగ్నిపరీక్షలనే ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ ప్రభుత్వాలు స్వేచ్ఛను బంధించాలనుకుంటున్నాయని, అరికట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అందువల్లనే చాలా మంది రచయితలు గొంతెత్తితో జైలుపాలవుతున్నారని, నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వస్తున్నదన్నారు.



Next Story

Most Viewed