మీడియా రంగంలో ‘దిశ’ను దిగజార్చే కుట్రలు..

by  |
మీడియా రంగంలో ‘దిశ’ను దిగజార్చే కుట్రలు..
X

20 నెలల కిందట మొదలై అనతికాలంలోనే మీడియా రంగంలో బలమైన శక్తిగా ‘దిశ’ దూసుకువచ్చింది. అలెక్సా ర్యాంకింగ్‌లో, ప్రజాదరణలో ప్రధాన సంస్థల సరసన చేరింది. నిత్యం పది లక్షలకు మించిన తెలుగు రాష్ట్రాల ప్రజలు దిశ ప్రచురించే వార్తలను రోజంతా ఎప్పటికప్పుడు చదువుతున్నారు. రాజకీయ పరిణామాలపై, పార్టీల అంతర్గత విషయాలపై, రైతుబంధు, దళితబంధు వంటి సంక్షేమ పథకాలపై, ధరణి తెచ్చిన సంస్కరణలపై ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చాం. ప్రజాసమస్యలపై మేమిచ్చిన కథనాలకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించిన ఘటనలు అనేకం ఉన్నాయి.

అయితే, ఈ పురోభివృద్ధి కొన్ని శక్తులకు కంటగింపుగా మారింది. ఏ మీడియా నడవాలన్నా వాణిజ్య ప్రకటనలు కీలకం. ఏ పార్టీకీ కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా వార్తలు అందిస్తున్న ‘దిశ’కు కూడా కీలకమే. ఈ దిశగా అడ్వర్టయిజ్‌మెంట్ విభాగాన్ని, న్యూస్ నెట్‌వర్క్ ను ఉపయోగించుకోవడం ఏ పత్రికకైనా అనివార్యం. అన్ని ప్రధాన స్రవంతి దినపత్రికలు అనుసరిస్తున్న విధానాన్నే మేమూ అమలుచేస్తున్నాం. పత్రిక అందిస్తున్న సేవలకు ప్రతిగా పాఠకుల నుంచి, ప్రకటనకర్తల నుంచి మద్దతు కోరుతున్నాం.

కాగా, ఈ విషయాన్ని చిలవలు పలవలు చేసి ఎడిటర్ పైనా, ఎడిటోరియల్ టీం పైనా కొన్ని శక్తులు అబద్ధపు పోస్టులు పెడుతున్నాయి. సిబ్బందిని డిమోరలైజ్ చేసే, దిశ ప్రతిష్టను దిగజార్చే నీచపు పనికి పూనుకుంటున్నాయి. ఆ శక్తులు ఏవైనా వదలబోమని హెచ్చరిస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాం. మా యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి దోషులను పట్టుకోవాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులకు విజ్నప్తి చేస్తున్నాం. సంస్థ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి యత్నాలకు ‘దిశ’ బెదరబోదని, చెదరబోదని ప్రకటిస్తున్నాం.
-డి మార్కండేయ, ఎడిటర్

Next Story