గెలుపు కోసం కుట్రలు.. హుజురాబాద్‌లో దొంగ ఓట్లు.?

by  |
గెలుపు కోసం కుట్రలు.. హుజురాబాద్‌లో దొంగ ఓట్లు.?
X

దిశ, హుజురాబాద్ : ప్రగతి భవన్ నుండి సీఎం కేసీఆర్, రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌజ్, సింగాపూర్ గెస్ట్ హౌజ్ కేంద్రంగా మంత్రి హరీష్ రావు వ్యూహాలు పన్నుతున్నారు. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, వందలాది మంది నాయకులు.. గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టుగా పడ్డారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ పార్టీలో చేర్పించుకుంటున్నాడని మంత్రి హరీష్ రావుపై ఈటల రాజేందర్ మండిపడ్డారు.

అర్ధరాత్రి పోలీసులతో వెళ్లి తమ పార్టీలో చేర్పించుకుంటున్నారన్నారు. సిద్దిపేట నాయకులతో హుజురాబాద్‌లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు ఎంపీటీసీలపై చిటికెలు వేస్తూ, పార్టీ నాయకులపై చిందులు వేశారన్నారు. ఓటు బ్యాంకు ఉన్న వారిని పార్టీకి అనుకూలంగా మల్చుకునేందుకు వారిపై తీవ్ర ఒత్తిళ్లకు గురి చేశారన్నారు. హుజురాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా ఇక్కడి బిడ్డలు ధైర్యంగా తనకు అండగా నిలిచారన్నారు.

దళిత బంధు కావాలంటే పార్టీ జెండా ఎగురవేయాలని, ఆశా వర్కర్ల భర్తలు ఇతర పార్టీలలో తిరగొద్దని హింసిస్తున్నారని, తనకు మద్దతు ఇచ్చిన వారి బంధువులు ప్రభుత్వ ఉద్యోగులైతే వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని మండిపడ్డారు. తాను పెట్టించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని, కుల సంఘాల నాయకులను ప్రలోభాలకు గురిచేశారని విమర్శించారు. గ్రామాలను దావత్‌లకు అడ్డాలుగా మార్చారని, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా టేబుళ్లు వేసి విందులు ఇచ్చేందుకు దిగజారారని ఈటల ఆరోపించారు. చిల్లర మల్లర రాజకీయాలకు పాల్పడితే తాను సహించేది లేదని స్పష్టం చేశారు.

చిన్న పిల్లవాడి నుండి పండు ముసలి వరకు జై ఈటల అంటూ బీజేపీనే గెలిపించుకుంటామని చెబుతున్నారని అన్నారు. 18 ఏళ్ల పాటు చేసిన సేవను హుజురాబాద్ ప్రజలు మర్చిపోలేదన్నారు. ప్రజలే కధానాయకులై ఎన్నికలు విజయవంతం చేయాలన్నారు. కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలని అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేసుకుని గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈటల ఆరోపించారు.

దొంగ ఓట్ల నమోదు కుట్రల గురించి ఆ డిపార్ట్‌మెంట్ నుండి తనకు సమాచారం వచ్చిందన్నారు. 2వ తేదీన హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎంజీ జీతేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్ర సేనారెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, ధర్మారావు, తుల ఉమ, అశ్వద్దామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధ్యక్షుడు ఎక్కడ.?

ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఆరంభంలో బీజేపీ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి లేకుండా మీడియా సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. చివరకు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కార్యకర్త వద్దకు వెళ్లి సముదాయించిన తరువాత మీడియా సమావేశం ప్రారంభం అయింది.



Next Story

Most Viewed