ఏపీలో నకిలీ యూనివర్సిటీ గుట్టురట్టు.. కేంద్రం కీలక ఆదేశాలు

by  |
ఏపీలో నకిలీ యూనివర్సిటీ గుట్టురట్టు.. కేంద్రం కీలక ఆదేశాలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్ట్‌ న్యూ టెస్టామెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ పేరుతో నకిలీ విశ్వవిద్యాలయం కొనసాగుతోందని యూజీసీ ప్రకటించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు. ఇలా దేశవ్యాప్తంగా 24 గుర్తింపులేని నకిలీ విశ్వవిద్యాలయాలు ఉండగా ఏపీలో ఒకటి ఉన్నట్లు యూజీసీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వ‌ర్సిటీల‌కు సంబంధించి మంగళవారం లోక్‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఈ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప్ర‌జ‌లు, ఎల‌క్ట్రానిక్, ప్రింట్ మీడియా నుంచి వ‌చ్చిన ఫిర్యాదులను ప‌రిశీలించిన యూజీసీ 24 వ‌ర్సిటీల‌ను న‌కిలీవిగా తేల్చిందని తెలిపారు. అయితే వీటిలో అత్యధికంగా యూపీలో ఉండగా ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ యూనివర్సిటీలు అన్నీ యూజీసీకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని.. వీటికి ఎలాంటి డిగ్రీ ప్రధానం చేసే అర్హత లేదని స్పష్టం చేశారు.

ఇకపోతే ఏపీలోని గుంటూరులో ఉన్న క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ కూడా నకిలీదేనని స్పష్టం చేశారు. ఈ యూనివర్సిటీకి కాకుమానువారితోట, శ్రీనగర్‌లో కార్యాలయాలు ఉన్నట్లుగా తెలిపింది. నకిలీ యూనివర్సిటీలో చేరి మోసపోవద్దని విద్యార్థులను ఇప్పటికే యూజీసీ హెచ్చరించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నకిలీ వ‌ర్సిటీల జాబితాను ఇప్ప‌టికే యూజీసీ ఇంగ్లిష్‌, హిందీ వార్తా పేప‌ర్ల‌లో ప్ర‌చురింప‌జేసేలా చేసి ప్ర‌జ‌ల దృష్టిని తీసుకువ‌చ్చింద‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ చెప్పారు. అటువంటి వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాల ప్ర‌భుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, విద్యాశాఖ కార్య‌ద‌ర్శులు, ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీల‌కు లేఖ‌లు రాసింద‌ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.


Next Story

Most Viewed