జూన్ 2న బీజేపీలోకి లాంఛనంగా ఈటల చేరిక?

by  |
ex-minister-Etela-Rajender,
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతాడని వార్తలు వస్తున్న తరుణంలో ఆయన ఢిల్లీలో వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం సంచలనంగా మారింది. దీంతో ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. కమలం బాసులను కలిసేందుకు ఆదివారమే ఢిల్లీ వెళ్లిన ఈటల నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లి ఈటలను నడ్డాతో భేటీ చేయించే అవకాశం ఉంది. నడ్డాతో సమావేశం సందర్భంగా ఈటల కాషాయ కండువా కప్పుకుంటారా..? లేక చర్చలు జరిపి చేరిక ముహూర్తం తరువాత నిర్ణయిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఈటల బీజేపీలో చేరే విషయంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వివేక్‌ కూడా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చలు సఫలం అయితే.. జూన్ 2వ తేదీన ఈటలను లాంఛనంగా బీజేపీలో చేర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌కు ఉమ్మడి జిల్లాలో సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఏ నియోజకవర్గానికి వెళ్లినా సన్నిహితులు, అభిమానులు ఆయన చుట్టూ చేరుతారు. ఈ నేపథ్యంలో గతకొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీని సందర్భం ఉన్నప్పుడుల్లా ఈటల పరోక్షంగా విమర్శిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఈటలకు చెక్ పెట్టాలని భావించిన అధిష్టానం, భూకబ్జాల ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించింది. అనంతరం ఈటల నియోజకవర్గమైన హుజూరాబాద్‌తోపాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ఈటల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది.



Next Story

Most Viewed