‘మా భాగస్వామ్యం ప్రపంచ శాంతికి కీలకం’

by  |
‘మా భాగస్వామ్యం ప్రపంచ శాంతికి కీలకం’
X

న్యూఢిల్లీ: ఐరోపా సమాఖ్య దేశాలు, భారత్ మధ్య భాగస్వామ్యం ప్రపంచశాంతికి కీలకమని, ప్రస్తుత పరిస్థితుల్లో నేడు ఈ విషయం మరింత స్పష్టమైందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియా-ఈయూ వర్చువల్ సమ్మిట్‌లో మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుత సవాళ్లతోపాటు పర్యావరణ మార్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలను యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైఖెల్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వొన్ డెర్ లెయెన్ సమక్షంలో ప్రస్తావించారు. రినెవెబుల్ ఎనర్జీ అవసరాన్ని నొక్కివక్కాణించారు. ఈ ఎనర్జీని పెంచాలనే భారత ప్రయత్నాలకు ఈయూ మద్దతివ్వాలని, ఈ దేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతికతను ఆహ్వానిస్తున్నట్టు మోడీ తెలిపారు.

భారత్-ఈయూలది సహజ బంధమని, ఈ భాగస్వామ్యం ఆర్థిక పునరుద్ధరణ, మానవ కేంద్ర ప్రపంచీకరణకు కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. ఈయూ దేశాలు, భారత్‌లు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, పారదర్శకత, బహుత్వం వంటి విలువలను పాటిస్తాయని, కార్యచరణ ప్రాతిపదిక ఎజెండాను విస్తరించుకోవాలని, నిర్దేశించుకున్న సమయంలోపు లక్ష్యాలను నెరవేర్చుకోవాలని సూచించారు. ఒప్పందాలను మరింత పెంచుకోవడానికి ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఇరుపక్షాలు చర్చించుకున్నారు. సముద్ర జలాల రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులను మెరుగు చేసుకోవడానికి ప్రత్యేక చర్చలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. 27దేశాలున్న ఈయూ భారత్‌కు కీలక భాగస్వామి. 2018లో ఈ సమాఖ్య భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది.

Next Story

Most Viewed