ఈ-కామర్స్ కంపెనీలు వారి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి

by  |
ఈ-కామర్స్ కంపెనీలు వారి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ-కామర్స్ కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) అభిప్రాయపడింది. కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ భారీగా పెరిగింది. దీంతో కస్టమర్ల ప్రయోజనాల కోసం ఈ-కామర్స్ కంపెనీలు విక్రయించే వారికి సంబంధించిన పేరు, చిరునామా సహా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని సీసీపీఏ వెల్లడించింది. ఈ-కామర్స్ కంపెనీలు అమ్మే ఉత్పత్తులపై పేరు, అడ్రస్, ఫిర్యాదుల అధికారి వివరాలను తప్పనిసరిగా జత చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు పరిశ్రమ వర్గాలకు సీసీపీఏ ఆదేశాలిచ్చింది.

తాము జారీ చేసిన మార్గదర్శకాలను పాటించకపోతే కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఈ-కామర్స్ నిబంధనలు-2020ను అనుసరించి చర్యలు తీసుకోనున్నట్టు సీసీపీఏ కమిషనర్ అనుపమ్ మిశ్రా వివరించారు. పలు ఈ-కామర్స్ కంపెనీలు ఉత్పత్తులపై నిబంధనల ప్రకారం వివరాలను అందించడం లేదని ఫిర్యాదులు వచ్చాయని సీసీపీఏ తెలిపింది. కేవలం ఏప్రిల్-జూలై మధ్య మూడు నెలల్లోనే మొత్తం 69 వేలకు పైగా ఇలాంటి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. వీటిని పరిశీలించిన తర్వాత తాజా ఆదేశాలను జారీ చేసినట్టు సీసీపీఏ వెల్లడించింది.


Next Story

Most Viewed